ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్... ప్రజల నుంచి మాత్రం ఆశించిన ఆదరణ పొందలేకపోతోంది. ఏ ఎన్నికలు వచ్చినా... ఓటమినే మూటగట్టుకుంటోంది. ప్రత్యేకించి ఉపఎన్నికలు మాత్రం హస్తం పార్టీకి కలిసి రావడం లేదు. సిట్టింగ్ స్థానాలను సైతం నిలబెట్టుకోలేక చతికిలపడుతూ వస్తోంది.
అప్పటి నుంచే ఓటమి పరంపర...
రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ రాజీనామాతో వచ్చిన మెదక్ ఉపఎన్నికతో మొదలైన కాంగ్రెస్ ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. నారాయఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలోనూ హస్తం పార్టీ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత కడియం శ్రీహరి రాజీనామాతో జరిగిన వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలోనూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. నల్గొండ ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో వచ్చిన హుజూర్నగర్ ఉప ఎన్నికలోనూ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో పార్టీ మొత్తం పనిచేసినా డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కూడా విజయఢంకా మోగించలేకపోయారు.
పార్టీ కేడర్‌లో ఆందోళన..
తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో కాంగ్రెస్ పార్టీ మరో సవాల్‌ను ఎదుర్కోబోతోంది. వాస్తవానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 1983 తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ గెలువలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 62వేల ఓట్లు సాధించి కొంత ప్రభావాన్ని చూపగలిగింది. ఈటల రాజేందర్... పార్టీ మారిన తర్వాత ఆ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పాడి కౌశిక్ రెడ్డి... ఇటీవలే తెరాస గూటికి చేరారు. ఈ తాజా పరిణామంతో అభ్యర్థి ఎవరనే అంశంపై ఆ పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది.