రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election).. అభ్యర్థుల మధ్య పోరు పోటాపోటీగా ఉంది (Huzurabad by-election). బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ.. ముగ్గురే అన్నట్టుగా ఉంది. ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసి అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌తో (etela rajendar) తలపడుతున్న ప్రత్యర్థులు ఇద్దరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగు పెట్టిన వారు కావడం గమనార్హం.
ఈటల రాజేందర్ ప్రస్థానం…
2002లో ఉద్యమ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్.. తెరాసతో మమేకమై పనిచేశారు. 2004 నుంచి జనరల్, ఉప ఎన్నికల్లో ఆరు సార్లు కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంపై తిరుగులేని పట్టున్న ఈటల మరోసారి ప్రతికూల రాజకీయ పరిస్థితుల మధ్య సెంటిమెంట్‌తో తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ ఈటల తన ప్రభావాన్ని తగ్గించుకోకుండా పావులు కదుపుతున్నారు.
ఓటు బ్యాంకు ఎక్కడ ఉంటుంది, ఏ ఓటర్లను ఎలా మల్చుకోవాలి అన్న విషయంపై అనుభవం గడించిన రాజేందర్.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయిదు నెలలకు పైగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఏడోసారి చట్ట సభలోకి అడుగు పెట్టాలన్న యోచనతో ప్రత్యర్థులకు చిక్కకుండా స్కెచ్‌లు గీస్తూ ముందుకు సాగుతున్నారు. భాజపా తరఫున బరిలోకి దిగిన ఈటల.. జాతీయ పార్టీ బలం తనకు మరింత తోడవుతుందని అంచనా వేస్తున్నారు.
గెల్లు ప్రస్థానం కూడా అక్కడి నుంచే
హుజూరాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election) అధికార తెరాస తరఫున (trs candidate) బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస్ (gellu Srinivas yadav) ప్రస్థానం కూడా ఉద్యమాల్లోంచే పుట్టింది. ఉస్మానియా వేదికగా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పీజీ, ఎల్ఎల్బీ పూర్తి చేసి రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ విద్యార్థిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి కూడా ఉస్మానియా విద్యార్థిని... ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.
వీణవంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోనే చాలా కాలంగా ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో వస్తున్న మార్పులను అంచనా వేసుకొని నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్‌ను కొంత తయారు చేసుకున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఓడించాలని తహతహలాడుతున్నారు. కొంతకాలంగా ఈటలకు, గెల్లుకు మధ్య అభిప్రాయ బేధాలు ఉండడంతో గెల్లు అధినాయకత్వం అండదండలతో పార్టీలో కొనసాగుతున్నారు. తన సొంత ఇమేజ్ కన్నా పార్టీ ఇమేజ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. నియోజకవర్గంలో బీసీ కార్డును ఉపయోగించి సక్సెస్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.