తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ఆ నేతలు స్పందించాలి' - b vinod kumar comment on bjp leaders

భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్నాటకలోని ఎగువభద్రతో సహా రాష్ట్రానికి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర భాజపా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

Kaleshwaram project, b vinod kumar
'కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ఆ నేతలు స్పందించాలి'

By

Published : Mar 27, 2021, 7:55 PM IST

భాజపా పాలిత రాష్ట్రమైన కర్నాటకలోని ఎగువభద్రతో పాటు రాష్ట్రానికి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ 2016 ఫిబ్రవరి 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నిరంతరంగా కోరుతూ కేంద్ర మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్​లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని పేర్కొన్నారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేది లేదని.. 2018 ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని వినోద్​ అన్నారు.

కర్నాటక రాష్ట్రంలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి తుది ఆమోదం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపిందని చెప్పారు. ఎగువ భద్ర ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర భాజపా ఎంపీలు కల్పించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేలా చొరవ చూపాలని వినోద్ కుమార్ సూచించారు.

ఇదీ చూడండి :ఉపాధి, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details