Vending Zones in Karimnagar : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు పక్కా ప్రణాళికలతో నగరపాలకసంస్థ ముందుకెళుతోంది. రోడ్డు ప్రమాదాలకు తోడు రహదారుల విస్తరణలో భాగంగా వీధివ్యాపారులను అధికారులు ఖాళీ చేయించారు. నగరపరిధిలో ఎక్కడ చూసినా అడుగడుగునా పండ్ల దుకాణాలు..చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు,కొబ్బరి బోండా దుకాణాలు కనిపించేవి. ట్రాపిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. రెడ్‌జోన్లు మినహా మిగతాచోట్ల వెండింగ్ జోన్లుగా నిర్ణయించారు. ఆ ప్రాంతాల్లో మాత్రమే చిరు దుకాణాలను అనుమతించాలని యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో వీధివ్యాపారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వెండింగ్ జోన్లలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులతో షట్టర్లు నిర్మించడాన్ని స్వాగతిస్తున్నారు. వ్యాపారాల్లేక బతుకుదెరువు కోల్పొయిన తమకు త్వరగా దుకాణాలు నిర్మించి తమకు అందజేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
"30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కనే కిరాణా షాపు నడిపించుకున్నం. కరోనా వల్ల మేం చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాది నుంచి రహదారి విస్తరణ వల్ల మరింత అవస్థలు పడుతున్నాం. కార్పొరేటర్, మేయర్ వచ్చి.. మాకు షెటర్లు కట్టిస్తామన్నారు. రోడ్డు విస్తరణకు అడ్డురాకుండా షెటర్లు నిర్మించి ఇస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇగ మాకు మళ్లీ మంచి రోజులు వచ్చినయి. మాకు సాయం చేస్తున్న మేయర్‌కు కృతజ్ఞతలు."
- చిరువ్యాపారులు, కరీంనగర్