ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇవాళ రాత్రికి కరీంనగర్ చేరుకోనున్న సీఎం... తీగలగుట్టపల్లిలో బస చేస్తారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకోనున్నారు. అక్కడ ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం మేడిగడ్డ వద్ద లక్ష్మి ఆనకట్ట, జలాశయాన్ని పరిశీలిస్తారు.
తుపాకులగూడెం ఆనకట్టకు సమ్మక్క పేరు - సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
18:22 February 12
రేపు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం కేసీఆర్
జలాశయంలో నీటి నిల్వ, ప్రవాహం, ఇతర అంశాలను సీఎం తెలుసుకుంటారు. అధికారులు, ఇంజినీర్లతో అక్కడే సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మూడో టీఎంసీకి సంబంధించిన పనుల పురోగతిని తెలుసుకోనున్నారు. కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఎప్పటికప్పుడు ఎత్తిపోయాలి..
కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటోందని సీఎం తెలిపారు. ఆనకట్టలు నిండుకుండలా మారాయని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలం నుంచి వరదనీటి ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రాణహిత ద్వారా లక్ష్మి ఆనకట్టకు చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోయాలని సూచించారు. ఆ దిశగా నీటిపారుదల శాఖ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని, అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
పేరు మార్చాలని ఆదేశం
గోదావరి నదిపై నిర్మిస్తోన్న తుపాకులగూడెం ఆనకట్టకు వనదేవత సమ్మక్క పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఈఎన్సీ మురళీధర్‌ను ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉన్నందునే తెలంగాణలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందని కేసీఆర్ అన్నారు.