మాయదారి కరోనా రోగం మనషుల్ని దూరం చేసిన తరుణంలో అసలైన మనస్సుతో స్పందించిన స్నేహ వికాసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిమళించింది. నేడు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా జిల్లాలోనే పలువురు స్నేహితుల స్ఫూర్తిదాయక చొరవపై కథనాలు..
మిత్రుల సేవా నేత్రం... - పెద్దపల్లి
కరోనా బారిన పడిన మిత్రుడిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. కుటుంబ సభ్యులకు మించి సపర్యలు చేశారు. పరిస్థితి విషమించి దూరమైన అతడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లికి చెందిన బరిగల నేత్ర(31) గత ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డారు. 18 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమించడంతో నేత్రతో కలిసి 2005-06లో పదో తరగతి చదువుకున్న టి.అభినవ్, రాపెల్లి శ్రీనివాస్, కలహాల అన్వేష్ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం కోసం రూ.50 వేల వరకు వెచ్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో నేత్ర మే 24న మృతి చెందారు. స్నేహితులు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చినా కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించారు. దీంతో నేత్రతో తమ జ్ఞాపకాన్ని పదిలం చేసుకునేందుకు మిత్రులు రూ.60 వేలు వెచ్చించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, నాణ్యమైన ఆహారాన్ని అందించారు.
సామాజిక సేవలో ‘బాల్యమిత్ర’... - ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-1995 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులంతా కలిసి మూడేళ్ల క్రితం బాల్యమిత్ర ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 1.60 లక్షల చొప్పున ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షలను ఆర్థికసాయంగా అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 200 నిరుపేద కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబానికి రూ. 1500 విలువైన నిత్యావసర సరకులు, రూ. 200 నగదు పంపిణీ చేశారు. వివిధ రకాలుగా పలువురికి ఆర్థికసాయం చేశారు. సామాజిక సేవలను మున్ముందు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
రూ.30 లక్షలు వెచ్చించి.. - సుభాష్‌నగర్
కరీంనగర్ నగరపాలక కార్యాలయంలో పని చేస్తున్న డీఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న ఏఈఈ కన్నం శ్రీనివాస్ స్నేహితులు. రెండో వేవ్‌లో వచ్చిన కరోనా మహమ్మారి ఏఈఈ శ్రీనివాస్‌ను వదల్లేదు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంతో ఆర్థిక భారం మొదలైంది. డిప్లొమా ఫ్రెండ్స్, తోటి సహాద్యోగులు, అధికారులు, బంధువులు కలిసి ఆర్థికంగా ఆదుకున్నారు. కోలుకున్న తర్వాత 10రోజులకే మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 15రోజుల పాటు చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తంగా రూ.30లక్షలు ఖర్చు కాగా స్నేహితులు వెంకటేశ్వర్లు, ఆయన బంధువు మురళీకృష్ణ ముందుండి స్నేహితుల సహకారంతో ఆర్థికంగా ఆసరాగా నిలిచారు.