తెలంగాణ

telangana

ETV Bharat / state

Trs Focus On Huzurabad: టార్గెట్​ హజూరాబాద్​... ప్రణాళికలు సిద్ధం చేసిన అధికార పార్టీ - trs fully focused on Huzurabad

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad by-election)కు ముహూర్తం ఖరారు కావడం వల్ల గులాబీపార్టీ (Trs Party) ప్రచారంలో మరింత వేగం పెంచేందుకు ప్రణాళికలు (Trs Focus On Huzurabad) సిద్ధం చేసింది. ఈటల రాజేందర్ పార్టీని వీడినప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఈటల వైపు మొగ్గుచూపకుండా జాగ్రత్త పడిన అధికార పార్టీ.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన అస్త్రాలుగా ప్రచారం చేస్తోంది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న మంత్రి హరీశ్‌రావు పూర్తిస్థాయిలో నియోజకవర్గంలోనే ఉంటున్నారు. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభ, ప్రచారం త్వరలో ఖరారు కానుంది.

Huzurabad
హజూరాబాద్

By

Published : Sep 29, 2021, 4:49 AM IST

హుజురాబాద్ ఉపఎన్నిక(Huzurabad by-election)కు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెరాస అస్త్రశస్త్రాలన్నీ పూర్తి స్థాయిలో ఉపయోగించేందుకు (Trs Focus On Huzurabad) సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎత్తులు, పైఎత్తులతో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ... నెల రోజుల్లో మరిన్ని వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈటల రాజేందర్‌(Etela Rajender)ను మంత్రిగా తొలగించినప్పటి నుంచే గులాబీ పార్టీ ఎన్నికల దిశగా అడుగులు ప్రారంభించింది.

స్పష్టమైన అంచనాతో...

ఉపఎన్నికపై స్పష్టమైన అంచనాతో అన్నిచూసుకున్న తర్వాతే ఈటలను పార్టీ నుంచి పంపేందుకు తెరాస సిద్ధమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన వెంట వెళ్లకుండా జాగ్రత్త పడింది. ఈటలకు సానుభూతి రాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకుపడే వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రాజేందర్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పార్టీ, ప్రభుత్వానికి ద్రోహం చేశారని.. అందుకే వేటు వేశారని జనాల్లోకి తీసుకెళ్తోంది. హూజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు.

గెలుపు, ఓటములపై ప్రభావం చూపే ఎస్సీ, బీసీలను ఆకర్షించేలా మంత్రాంగాన్ని గులాబీ పార్టీ అమలు చేస్తోంది. అభ్యర్థి ఖరారులో ఆచితూచి అనేక కోణాల్లో విశ్లేషించి గెల్లు శ్రీనివాసయాదవ్‌ను రంగంలోకి దించింది. ఈటల రాజేందర్‌ ప్రధానంగా బీసీ, ఉద్యమకారుడు అనే కార్డులు వాడుతున్నందున.. శ్రీనివాసయాదవ్ ఆ రెండింటికీ సరిపోతారని అధికార పార్టీ భావిస్తోంది. స్థానికుడు, విద్యార్థి ఉద్యమ నేత, బీసీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గెల్లు అభ్యర్థిత్వం కచ్చితంగా కలిసొస్తుందని తెరాస విశ్వసిస్తోంది.

దళితబంధు అస్త్రం...

దళితబంధు(Dalitha Bandu)అస్త్రాన్ని బయటకు తీసిన తెరాస పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్ నుంచే ప్రారంభించింది. ఆ పథకం కచ్చితంగా ప్రధాన ఓటింగ్ అంశంగా ఉంటుందని.. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా సామాజిక వర్గాల్లో నిరాశ కలగకుండా ఉండేందుకు రానున్న కాలంలో బీసీ బంధు సహా అన్ని సామాజిక వర్గాల్లో పేదలబంధు అమలు చేస్తామని కేసీఆర్ (Kcr) సహా పార్టీలోని ముఖ్యనేతలంతా చెబుతున్నారు. తెరాసలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన... ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావుకు (Finance Harish Rao) ప్రధాన బాధ్యతలు అప్పగించారు. సుమారు రెండునెలలుగా నియోజకవర్గంలో ఉంటూ... అన్నీతానై వ్యవహరిస్తున్నారు.

వ్యూహాత్మకం...

వివిధ మండలాల్లో పార్టీఅభ్యర్థి శ్రీనివాస్ యాదవ్‌ (Gellu Srinivas Yadav)తో కలిసి..... ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కులసంఘాల ప్రతినిధులు, గ్రామాల్లోని కీలక వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి.. ఆయా సామాజిక వర్గాలు, సంఘాల అవసరాలు తెలుసుకొని.. వాటిని నెరవేర్చేందుకు హామీ ఇస్తున్నారు. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) మాత్రం హుజురాబాద్ ఎన్నిక చాలా చిన్నందంటూ పదేపదే వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాట్లాడటం వ్యూహాత్మకమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తారస్థాయికి..

నోటిఫికేషన్ రావడం వల్ల ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలుసర్వే నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్ వాటిని విశ్లేషిస్తూ... క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలతో ఫోన్లో చర్చిస్తూ.. ఏ విషయంలోనూ ఏమరుపాటుగా ఉండవద్దని.. పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రచారం ముగిసే ఒకటి, రెండ్రోజుుల ముందు హుజురాబాద్ లేదా జమ్మికుంటలో భారీ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ (Kcr Meeting At Jamikunta) పాల్లొనేలా ప్రణాళిక చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్ ప్రచార కార్యక్రమాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details