HUZURABAD BYPOLL CAMPAIGN: హుజూరాబాద్ ఓట్ల వేటలో పేలుతున్న మాటల తూటాలు హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం జోరుగా జరుగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే.. నాయకులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. అన్నింటి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు మాచనపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే.. భాజపా, కాంగ్రెస్ నాయకుల విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు.
ఎవరూ అడ్డుకోలేరు..
ప్రజల్ని భయపెట్టి తెరాస.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మబోరన్నారు. కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కొండపాక గ్రామాల్లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
'పంపకాల్లో తేడా వల్లే..'
పంపకాల్లో తేడా వల్లే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదన్న రేవంత్... సొంత ప్రయోజనాల కోసమే రాజీనామా చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముగ్గురూ తమ నియోజకవర్గాలకు స్థానికేతరులేనని విమర్శించారు. ఉపఎన్నికలో పోలీసులను నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు. నక్సలైట్లు ఉండుంటే పాలకుల అరాచకాలు ఈ స్థాయిలో ఉండేవి కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ఇల్లందకుంటలో ప్రచారం నిర్వహించారు.
ఇదీచూడండి:HUZURABAD BYPOLL: కేసీఆర్, ఈటల మధ్య విభేదాలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు