హుజూరాబాద్ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ఒక్కటేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈటల, హరీశ్‌రావు కలిసి కేసీఆర్‌ను పొగడలేదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట సభలో (HUZURABAD BYPOLL)టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేవుడి మాన్యాల పంపకాల్లోనే కేసీఆర్, ఈటలకు మధ్య విభేదాలు వచ్చాయన్నారని రేవంత్ ఆరోపించారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్ ఇవాళ ఉత్తముడు కాదని రేవంత్‌రెడ్డి (TPCC CHIEF REVANTH REDDY) ఎద్దేవా చేశారు.
'ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజక్టు ద్వారా సాగునీరందించి ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినా.. అని కేసీఆర్ చెబుతున్నారు. కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? కాళేశ్వరం పేరుమీద రూ.లక్షన్నర కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో రూ.30వేల కోట్లు సంపాదించుకున్నారు. అ డబ్బుతో హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామని కేసీఆర్ చెప్పారు.. కానీ 65 ఏళ్లు దాటిన వారికీ పింఛను రాలేదు. కొత్త పింఛన్లు మంజూరు చేయట్లేదు, పండించిన వరిని క్వింటా రూ.2వేలకు కొనుగోలు చేయడం లేదు.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’.