హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులూ తమ నియోజకవర్గాలకు అనామకులేనని విమర్శించారు. ఉపఎన్నికలో పోలీసులనూ నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భయపెట్టి ఓట్లు పొందేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని చేసిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.
ఉద్యమాల గడ్డ తెలంగాణను తెరాస సర్కారు తాగుబోతులకు అడ్డాగా మార్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస, భాజపాలు రాష్ట్ర పరువును దిగజారుస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. భాజపా, తెరాసకు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలో ఆలోచించాలన్నారు. పంపకాల్లో తేడాతోనే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని రేవంత్ అన్నారు. దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు లోకల్, నాన్ లోకల్ అంటున్నారన్న రేవంత్.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో పోటీచేసిన వాళ్లు స్థానికులా? అంటూ ప్రశ్నించారు. దుబ్బాక, హుజూర్‌నగర్, సాగర్‌లో ఇచ్చిన హామీలేమయ్యాయని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర పోలీసు విభాగం రెండు భాగాలుగా విడిపోయిందని రేవంత్ ఆరోపించారు. డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని పేర్కొన్నారు. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాల్‌రావు తమపై నిఘా పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్ వేరే పార్టీలో చేరారని.. ఆయన సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారని రేవంత్ ప్రశ్నించారు. త్వరలో తెరాసలో ముసలం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.