తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం! - కరీంనగర్‌ కాకతీయ కాలువలో ఘోరం

మృత్యువు ప్రమాదాల రూపంలో ఆ కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. కొడుకు ఓ ప్రమాదంలో చనిపోగా.. మిగిలిన ముగ్గుర్నీ కాకతీయ కాలువ తనలో కలిపేసుకుంది. ఓ మహిళ గల్లంతవడం వల్ల గాలిస్తుండగా ఈ మృత్యుఘోరం వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి మూడు వారాలవుతోంది.. పోలీసులు ఈ కాలువలో గాలించకపోతే వీరి మృతి మిస్టరీ ఎప్పటికి తేలేదో?

three-bodies
three-bodies

By

Published : Feb 18, 2020, 5:54 AM IST

Updated : Feb 18, 2020, 8:02 AM IST

కరీంనగర్‌ సమీపంలోని అలుగునూరు రాజీవ్‌ రహదారిపై కాకతీయ కాలువలో ఘోరం చోటుచేసుకుంది. సుమారు 21 రోజుల కిందట ఇంట్లోంచి కారులో బయల్దేరిన ముగ్గురు కుటుంబసభ్యులు సోమవారం విగతజీవులై కనిపించారు. కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య రాధ, కూతురు వినయశ్రీ కారులోనే జలసమాధి అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.

మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!

పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లెలు

సత్యనారాయణరెడ్డి భార్య రాధ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా చెల్లెలు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సత్యనారాయణరెడ్డి కరీంనగర్‌లో ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. కూతురు వినయశ్రీ నిజామాబాద్‌లోని ఓ దంతకళాశాలలో బీడీఎస్‌(తృతీయ సంవత్సరం) చదువుతోంది.

గత నెల 26న హైదరాబాద్‌ వెళ్తున్నట్టు సత్యనారాయణరెడ్డి చెప్పారని ఎరువుల దుకాణంలో పనిచేసే కార్మికుడు నర్సింగ్‌ తెలిపాడు. వారి ప్రయాణానికి కావాలంటే ఆ రోజు రాత్రి గ్యాస్‌ సిలిండర్‌, రైస్‌కుక్కర్‌, దుప్పట్లు, చాప తదితర వస్తువులు తాను కారులో పెట్టానని వివరించాడు. అదే నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు రాధ ఫోన్‌ చేసి యజమాని ఫోన్‌ రీఛార్జి చేయమని చెబితే రీఛార్జి చేయించానన్నాడు.

కాకతీయ కాలువలో లభ్యమైన కారు

మరుసటి రోజు కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని వివరించాడు. వారి జాడ తెలియకపోవడంతో కొద్ది రోజుల క్రితం సత్యనారాయణరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమోనని వెదికినా ప్రయోజనం లేకపోయినట్టు తెలిసింది. కాకతీయ కాలువ వంతెన నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో కాలువలో కారు కనిపించింది. నర్సింగ్‌ పెట్టానని చెబుతున్న సామగ్రి కారులో లేవు.

అసలేం జరిగిందంటే..?

  • ఆదివారం రాత్రి కాకతీయ వంతెనపై నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్న గన్నేరువరానికి చెందిన దంపతులు ప్రదీప్‌, కీర్తనలు అదుపుతప్పి కాలువలో పడిపోయారు. రాత్రి వేళ కావడం.. కాలువ చెంతన పురుగులు కళ్లల్లో పడటంతో ద్విచక్రవాహనదారు ప్రమాదం బారిన పడ్డారని పోలీసులు భావించారు. స్థానికులు ప్రదీప్‌ను తాళ్ల సాయంతో పైకి లాగారు. భార్య కీర్తన నీళ్లలో కొట్టుకుపోయారు. ఎల్‌ఎండీ నుంచి కిందకు పారే నీటి ఉద్ధృతిని తగ్గించి ఆమె కోసం వెదికారు. ఆదివారం అర్ధరాత్రి ఆమె మృతదేహం లభ్యమైంది.
  • సోమవారం ఉదయానికి నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో ఇదే కాలువలో ఓ కారు కనిపించింది. ఎల్‌ఎండీ ఠాణా ఎస్సై నరేశ్‌రెడ్డి సహా సిబ్బంది సంఘటనా స్థలికి వెళ్లి క్రేన్‌ సాయంతో కారును వెలికితీశారు. అందులో ముగ్గురి మృతదేహాలున్నాయి. కారు నంబరు ఆధారంగా మృతులను గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కాల్‌డేటాలతోపాటు సమీపంలోని టోల్‌ప్లాజా చెంతన వాహన ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఈ కుటుంబం చాలా రోజుల నుంచి కనిపించకపోయినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

ఇవీ చూడండి:అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..

Last Updated : Feb 18, 2020, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details