కరీంనగర్ దిగువ మానేరు జలాశయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తపోవనంలా కనిపిస్తోంది బాలగోకులం. పేరుకు తగ్గట్టుగా అక్కడికి వెళితే మనసును సేవాపరిమళం కూడా పలకరిస్తోంది. గోకులం ప్రాంగణం చూస్తుంటే ఒకే కుటుంబానికి చెందిన పిల్లలంతా ఇంటి పనులు చేసుకుంటున్నారా... అనిపిస్తోంది. కాని వాస్తవానికి వారంతా విధి ఆడిన నాటకంలో అనాథలుగా మారి తల్లిదండ్రుల ప్రేమ కోసం ఓగూటికి చేరిన పక్షులు. కేవలం కరీంనగర్ జిల్లా వాసులే కాదు.. అనాథ పిల్లలు ఎవరున్నా తమకు సమాచారం అందిస్తే అక్కున చేర్చుకుంటోంది ఈ గోకులం.
అలా మొదలైంది
జీవితంలో వ్యాపార పరంగా స్థిరపడి సమాజానికి తమవంతు సాయపడాలనే ఎనిమిది మంది స్నేహితుల లక్ష్యం ఈ బాలగోకులానికి ఊపిరిపోసింది. 2010లో వెంకట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజసేవకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వెంకట్ ఫౌండేషన్ ఛైర్మెన్ గంప వెంకట్ తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో అనాథశరణాలయం అని కాకుండా బాలగోకులం పేరుతో స్థాపించారు. సొంత భవనం నిర్మించడమే కాకుండా... స్నేహితులంతా కలిసి నెలకు సుమారు లక్షా 20వేల రూపాయల వరకు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు. అయిన వాళ్లకు దూరమైన తమను అక్కున చేర్చుకుని... భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గోకులమే... మాకులం... ఈ ఆవరణే మా జీవితం అంటున్నారు విద్యార్థులు.