రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం, సన్నబియ్యం పంపిణీ ప్రవేశపెట్టింది. అయితే పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం, సమాచార లోపంతో చాలా మంది ఉపాధ్యాయులకు ఈ సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 6 వేల పైచిలుకు ఉపాధ్యాయులు పని చేస్తుండగా.. ప్రభుత్వ లెక్కలు(యూడైస్ వెబ్‌సైట్)లో మాత్రం కేవలం లక్షా 24 వేల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. దాదాపు 80 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, సిబ్బంది సాయం కోసం దరఖాస్తు చేసుకున్నా.. తిరస్కరణకు గురయ్యాయి.
యూడైస్‌లో పేర్ల నమోదు ప్రక్రియ 2017లో ప్రారంభమైనా.. ఆ తర్వాత పేర్ల నమోదు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కొందరికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వమే చొరవ తీసుకుని.. మిగిలిన వారికీ సాయం అందేలా చూడాలని ఉపాధ్యాయులకు కోరుతున్నారు.