రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టులో నీరు అడుగంటి పోవడంతో తాగునీటికి సరికొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 టీఎంసీలతో నిండుకుండను తలపించిన ప్రాజెక్టులో.. నీటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తుండటం వల్ల ప్రస్తుతం 16 టీఎంసీలకు అడుగంటింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కుదురుపాక, నీలోజుపల్లితోపాటు మొత్తం 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఆ గ్రామాలకు సంబంధించిన పురాతన ఇళ్లు, ఇతర వ్యర్థాలతో నీరు కలుషితంగా మారినట్లు గుర్తించారు. అక్కడి నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం మలినాలతో కూడిన నీరు వస్తుండటం వల్ల నీటిని శుద్ది చేయడం సాధ్యం కాదని.. తాగడానికి ఈ నీరు పనికి రావని గత నెల 30 నుంచి సరఫరాను నిలిపివేశారు.