కరోనా మహమ్మారి రెండేళ్లుగా కల్లోలం సృష్టిస్తోంది. కంటికి కనిపించని వైరస్ ఎంతో మందిని బలితీసుకుంటోంది. మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు తారుమారయ్యాయి. ప్రాణాలను కాపాడుకోవడానికి లక్షల్లో ఖర్చు చేసినా చివరికి కన్నీళ్లే మిగిలేలా చేసింది. ఈ రెండేళ్ల కాలంలో మే నెల మాత్రం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎటు చూసినా మరణ మృదంగం మోగడం అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేసింది. నగర, పురపాలికల్లో వందల సంఖ్యలో ధ్రువీకరణ పత్రాల జారీ పరిస్థితులకు అద్దం పడుతోంది.
వందల కేసులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉన్న కరీంనగర్‌లో వైద్యం కోసం బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వందల కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఓ దశలో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ దొరక్కపోవడంతో అప్పుడు భయానక వాతావరణం నెలకొంది.
మే నెలలో వైరస్ బీభత్సం
ఒక్క మే నెలలోనే రోజుకు 20నుంచి 22మంది మృతిచెందినట్లు నగరపాలక ధ్రువీకరణ పత్రాలు చెబుతున్నాయి. మృతులను తీసుకెళ్లడానికి బంధువులు, కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితి పలు సందర్భాల్లో ఎదురైంది. అందరూ ఉన్నా అనాథ శవాల్లా అంత్యక్రియలు నిర్వహించడం ఆయా కుటుంబాలను కలిచివేసింది. శ్మశాన వాటికలు కరోనా మృతులతో నిండిపోగా అప్పటి పరిస్థితుల్లో ఏ రోజు ఎన్ని శవాలు వస్తాయో తెలియక ముందస్తుగా చితులు పేర్చి పెట్టుకోవడం నగరవాసులను కలవర పరిచింది.
నెలలో సుమారు వెయ్యి మంది
కరోనా కారణంగా ఒక్క నెలలో రెండు నగరాల్లో సుమారు వేయి మందికి పైగా మృతి చెందారు. కరీంనగర్ నగరపాలక పరిధిలో మే నెలలో ప్రైవేటు ఆస్పత్రులను పరిశీలిస్తే కరోనాతో 685మంది మరణించారు. మృతుల్లో పురుషులు 507మంది కాగా 178మంది మహిళలు ఉన్నారు. రామగుండంలో 132మంది మృత్యువాత పడగా... వారిలో 89మంది పురుషులు, 43మంది స్త్రీలు ఉన్నారు. ఈ లెక్కలు కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో మరణించినవారే. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 300మందికిపైగా మృతి చెంది ఉంటారని అంచనా. మృతుల్లో ఎక్కువ మంది యువకులు, మధ్య వయస్కులు ఉండటం గమనార్హం.
- కరీంనగర్- 211 (జనవరి ), 212(ఫిబ్రవరి), 216(మార్చి), 230(ఏప్రిల్), 685(మే)
- రామగుండం- 90(జనవరి), 87(ఫిబ్రవరి), 71(మార్చి), 93(ఏప్రిల్), 132(మే)
మీ సేవా కేంద్రాల్లో క్యూ
వైరస్ బారిన పడి మృతిచెందిన వారి వివరాలను ప్రైవేటు ఆస్పత్రులు నగరపాలక, పురపాలికలకు పంపిస్తుండగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించిన వారి వివరాలు అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలను మున్సిపాలిటీలు జారీ చేస్తాయి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే 21రోజుల తర్వాత మీసేవా కేంద్రాల వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి జిల్లా ఆస్పత్రిలో క్యూ కడుతుండగా... నగర, పురపాలికల్లో వందల సంఖ్యల్లో దరఖాస్తు చేసుకుంటున్నారంటే మేలో కరోనా సృష్టించిన కల్లోలం గురించి స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?