Kaleshwaram project Third TMC: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరద కాల్వకు సమాంతరంగా కాల్వ తవ్వేందుకు రామడుగు, గంగాధర, బోయిన్‌పల్లి మండలాల్లోని 12 గ్రామాల్లో 600 ఎకరాల భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు భూములు త్యాగం చేసిన తమపై మరోసారి సర్కార్ పిడుగు వేయొద్దని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడో టీఎంసీ ఎత్తిపోతలకు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న కర్షకులు వందల ఎకరాలు కోల్పోయాం
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ వల్ల మా కొండన్నపల్లి గ్రామంలో దాదాపు 50 ఇళ్ల వరకు పోతాయి. ఇప్పటికే గ్రామానికి 400 ఎకరాల భూములు కోల్పోయాం. ప్రభుత్వం మళ్లీ ఒకసారి సర్వే చేసి వరద కాల్వ ద్వారానే నీటిని తీసుకుపోవాలి. -రెండ్ల రాజిరెడ్డి, కొండన్నపల్లి రైతు
ఇదివరకే చాలా భూమి కోల్పోయాను. ప్రాజెక్టు కోసం ఐదు ఎకరాలు ఇచ్చాను. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఎకరం భూమి కూడా రాలేదు. మమ్మల్ని నట్టేట ముంచొద్దని వేడుకుంటున్నాం. ఇంటికో ఉద్యోగం, రూ. 40 లక్షల పరిహారం, ఇంటి స్థలం ఇచ్చే ఉద్దేశం ఉంటేనే ప్రభుత్వానికి భూములిస్తాం. లేదంటే ప్రస్తుతమున్న కాల్వనే మూడో టీఎంసీకి వినియోగించుకోవాలి. - నర్సయ్య, రైతు, కొండన్నపల్లి
గుంట భూమి కూడా రాదు
గతంలో భూమి కోల్పోతే.. మస్కట్ వెళ్లి సంపాదించుకుని మళ్లీ భూములు కొనుకున్నాను. ఇప్పుడు మళ్లీ కోల్పోయే పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోతే మా జీవనం గడవడం కూడా కష్టమే. ఎటువంటి ఆధారం ఉండదు. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలు లేక వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో గుంట భూమి కూడా రావడం లేదు. మా కష్టాలను ప్రభుత్వం గుర్తించి సరైన పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం.-రెండ్ల ముత్తయ్య, గంగాధర రైతు
గ్రామ సభలు
2004లో ఎస్సారెస్పీ వరద కాల్వ కోసం భూమిని సేకరించగా చాలామంది నష్టపోయామని కర్షకులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎకరానికి మూడింతల ధర చెల్లించినా... ఆ మొత్తంతో గుంట భూమి కొనలేని దైన్యస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల పరిధిలోని తిర్మలాపూర్, చిప్పకుర్తి, శ్రీరాములపల్లి, షానగర్, కిష్టాపూర్, కొండన్నపల్లి, నాగిరెడ్డిపూర్, కురిక్యాల, ఉప్పరమల్యాల, విలాసాగర్ , దేశాయిపల్లి, వరదవల్లి గుండా కొత్త కాల్వకు సర్వే చేపట్టి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతమున్న కాల్వనే మూడో టీఎంసీకి వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం భూసేకరణపై పునరాలించుకోకపోతే సర్వస్వం కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Harish Rao on Farm laws: 'కేంద్ర మంత్రి తోమర్ వ్యాఖ్యలపై ప్రధాని స్పష్టతనివ్వాలి'