ఉత్తమ శిక్షణ, మెరుగైన సౌకర్యాల కల్పనతో రాష్ట్రంలోని పోలీసు శిక్షణ కేంద్రాల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తోంది. రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లు... ప్రథమ స్థానంలో నిలిచాయి. 2018-19 సంవత్సరానికి గానూ కరీంనగర్ పీటీసీ ఎంపిక కాగా.... 2019-20 ఏడాదికి హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా ట్రోఫీ అందుకున్నాయి. వరంగల్ పట్టణ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలకు భారత దక్షణ మండలంలో 2017-18కి గాను ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా అవార్డును దక్కించుకుంది.
హైదరాబాద్ సీపీ అభినందనలు
2019-20 సంవత్సరానికి దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌గా... హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎంపిక అయింది. 2019-2020 సంవత్సరానికిగాను ట్రోఫీని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పాత బస్తీ పేట్లబురుజులోని ట్రైనింగ్ సెంటర్ ట్రోఫీకి ఎంపిక కావడంతో సిబ్బందిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అభినందించారు. ఈ శిక్షణ కేంద్రానికి శాంతి భద్రతల అదనపు సీపీ ఎల్ఎస్ చౌహాన్ ఇంఛార్జ్‌గా ఉన్నారు. వివిధ విభాగాల్లో వందలాది పోలీసులు పీటీసీలో శిక్షణ పొందారని... ఇందుకు కారణం అక్కడి సిబ్బంది అత్యుత్తమ సేవలేనని ఆయన కొనియాడారు. ట్రోఫీతో పాటు 2లక్షల రూపాయలను కేంద్ర హోం శాఖ ప్రకటించనట్లు వెల్లడించారు. అనంతరం సిబ్బందిని ఆయన సత్కరించారు.
ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణ
పదేళ్ల క్రితం ప్రారంభమైన కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాల మారుతున్న కాలంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకొని సిబ్బందిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణ నిర్వహణలో అన్నివిభాగాలను సాధించిన ఫలితాలను పరిగణలోకి తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లోని 36 కళాశాలల్లో ఉత్తమ శిక్షణ కళాశాలగా ఎంపికైంది. ఇండోర్ విభాగంలో 10 క్లాస్‌రూములు, కంప్యూటర్ ల్యాబ్, యుద్ధతంత్ర శిక్షణ సదుపాయాలు క్రీడల్లో వాలీబాల్, బ్యాడ్మింటన్, పుట్‌బాల్ ఇతర క్రీడలకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు బ్యాచులలో 921 మందికి శిక్షణ ఇచ్చారు. అధికారులు విధి నిర్వహణలో సిబ్బంది అంకిత భావం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు పొందగలిగామని ప్రిన్సిపల్ సునీత మోహన్ తెలిపారు. సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.