కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేరిట బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ.. సక్రమంగా వైద్యం అందించని తీరుపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో బాధితుల వేదన తమ దృష్టికి వచ్చిందని... ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు హెచ్చార్సీ తెలిపింది. ఇందుకు సంబంధించిన విచారణ జరపాలని జిల్లా పాలనాధికారితో పాటు వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై హెచ్చార్సీ అసహనం - telangana human rights commission
కరోనా పేరిట బాధితుల నుంచి అధిక ఫీజులు వసూల్ చేయడంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై సోషల్ మీడియాలో బాధితుల వేదనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
సమగ్ర వివరాలతో జూన్ 29 లోపు నివేదిక ఇవ్వాలని నోటీసులు అందజేసింది. నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు లక్ష రూపాయాల్ని కచ్చితంగా ముందుగా చెల్లించాలనేలా రోగుల సంబంధీకులపై ఒత్తిడికి గురిచేస్తున్నాని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న తీరుపై వెంటనే దృష్టి సారించాలని ఆదేశించింది. అడిగినంతగా డబ్బులు చెల్లించని రోగుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ఈ తీరు సరైనది కాదని తెలిపింది. చికిత్స అందించే సమయంలో సరైన వసతుల్ని కల్పించకపోగా... అకారణంగా ఒకరిని డిశ్చార్జ్ చేసి వారి స్థానంలో మరొకరికి చికిత్సనందిస్తున్న తీరుపై ఎందుకు పర్యవేక్షణ లేదని ప్రశ్నించింది.