రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. కరోనా కేసులు రోజురోజుకు మరింత వేగంగా పెరిగే అవకాశమున్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించిన ఈటల.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున.. వైరస్ నివారణకు స్వీయ నియంత్రణ, ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదు : ఈటల - telangana health minister
సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున.. మహమ్మారి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా టీకా సరఫరా లేదని తెలిపారు. ఈ వ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేది కాదని.. కేంద్రం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలోనే వ్యాక్సిన్ తయారీ జరుగుతున్నందున.. అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరినట్లు చెప్పారు.
రెమిడెసివిర్ ఇంజిక్షన్ తయారీ ప్రారంభమైనట్లు మంత్రి చెప్పారు. ఈనెల 20 తర్వాత ఈ ఇంజిక్షన్ల కొరత లేకుండా చూస్తామని.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే డిపోలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజిక్షన్ల విషయంలో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అధికంగా డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని మంత్రి ఈటల హెచ్చరించారు.