Double Bed room houses to karimnagar accident victims: కరీంనగర్లో ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాద ఘటన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. ఘటనలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. వారి కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అదే విధంగా రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో 14 కి.మీ విస్తీర్ణంలో రెడ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లపై ఎవరూ వ్యాపారం చేయకూడదని స్పష్టం చేశారు.
కూలీలపై కారు బీభత్సం
కరీంనగర్ నగరం నుంచి కోతిరాంపూర్ వెళ్లే దారిలో.. కరీంనగర్- హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన కొందరు కూలీలు కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ... ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఆరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు.