Farmers Struggling to Sell Paddy: వానాకాలం పంట కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు(paddy purchase centers) ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వారాల కొద్ది ధాన్యం రాశుల వద్దనే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఈనెల 5వ తేదీన కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమే కాకుండా యుద్దప్రాతిపదికన కొనుగోలు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో ధాన్యం కొనుగోలుకు ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తం అయ్యింది. అధికారులు ప్రజాప్రతినిధుల ముందు ధాన్యం కొనుగోలు ప్రారంభించినా ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ నత్తతో పోటీ పడుతోంది.
అన్నదాతల ఆవేదన
అకాల వర్షం కారణంగా అనేక సార్లు ధాన్యం తడుస్తున్నా కనీసం కాపాడుకోలేక పోతున్నామని అన్నదాతలు(farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయలేక పోయినా కనీసం టార్పాలిన్లు సరఫరా చేసినా బాగుండేదని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పలుకుబడి ఉన్న రైతులకు సంబంధించిన ధాన్యం చకచకా కొనుగోలు జరుగుతుండగా.. సాధారణ రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తేమ శాతం వచ్చినా కొంటలేరు
కొన్ని రోజుల క్రితం కుప్పపోసినం. వర్షాలకు ధాన్యం రోజు తడుస్తోంది. ఒక్క పరదా కూడా ఇస్తలేరు. ఎవరూ మమ్మల్ని లెక్క చేస్తలేరు. తేమ శాతం 13, 14 వచ్చినా కొంటలేరు. మా అవస్థలు పట్టించుకున్న నాథుడు లేదు. పంట పండించేందుకు ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. -రాధ, రైతు, గోపాలరావుపేట, కరీంనగర్ జిల్లా
అవస్థలు పడుతున్నాం..
ప్రతిరోజు ధాన్యం ఆరబోస్తున్నాం. మళ్లీ కుప్పపోస్తున్నాం. 15రోజుల నుంచి ధాన్యం కుప్పల వద్దే ఉంటున్నాం. వర్షాలు పడటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. తేమ శాతం వచ్చినా ధాన్యం ఎత్తట్లేరు. అవస్థలు పడుతున్నాం. -అయిలయ్య, రైతు, గోపాలరావుపేట,కరీంనగర్ జిల్లా