Telangana Congress MLA Tickets in Karimnagar : కరీంనగర్ సహా మిగతా ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వడపోత ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన ఇద్దరు ముగ్గురి పేర్లలో ఎవరిని ప్రకటించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది. కరీంనగర్‌లో 15 మంది పోటీ పడుతుండగా అందులో ముగ్గురి పేర్లను అధిష్ఠానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జయపాల్ రెడ్డితో పాటు.. శ్రీనివాస్, నరెందర్‌రెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చొప్పదండిలో గతంలో ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గంలో సమస్యలపై గళమెత్తడమే కాకుండా మేడిపల్లి సత్యం ‘గడప గడపకు కాంగ్రెస్’ పేరిట ప్రచారం చేస్తున్నారు. అతని పేరు తొలి జాబితాలో లేకపోవడం పార్టీ శ్రేణుల్ని అయోమయంలో పడేసింది.
సిరిసిల్లలో దరఖాస్తు చేసుకున్న వారిలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థిని తేల్చేపనిలో పార్టీ నిమగ్నమైంది. హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్ సహా వొడితెల ప్రణవ్ బాబు మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. కోరుట్ల టికెట్ విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జన కొనసాగుతోంది. జువ్వాడి నర్సింగరావుతో పాటు.. కరంచంద్, మరికొందరు ఆశిస్తున్నారు. ఆ ఆరు చోట్లలోఎవరిది పైచేయి అవుతుందనే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని, పెద్దపల్లి, రామగుండం స్థానాలకు పేర్లను హస్తం పార్టీ ప్రకటించింది. ఇక్కడ ప్రచారానికి రాహుల్ గాంధీఈనెల 19 రానున్నారు.. అదే రోజు కరీంనగర్‌లో పాదయాత్ర చేపట్టనుండటంతో అప్పటి వరకు అభ్యర్థిత్వం కొలిక్కి వస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం