Telangana Assembly Election Campaign :టిక్కెట్ దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం(Telangana Election Camapaign)లో దూసుకుపోతున్నారు. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత.. మొదటి వార్డులో ప్రచారాన్ని నిర్వహించారు. దివంగత నేత సాయన్న చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మారావు పాదయాత్రను మణికేశ్వర్‌నగర్‌లో స్థానికులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన తెలిపారు. అమీర్‌పేట్‌లో గురుద్వార కమిటీ పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని పాల్గొని.. సనత్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నిర్మల్‌లోని బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలికి చెందిన బీజేపీ యువకులు 100మంది.. ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మెదక్ నియోజకవర్గంలోని పాతూరులో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి.. ప్రచారం చేయకుండా యువకులు ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. గిరిజనులకు మాత్రమే పోడు భూమి పట్టాలిచ్చారని.. దళితులకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Assembly Elections in Telangana 2023 :కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో తండ్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రచారాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు స్థానికులు నిరసన తెలిపారు. బీసీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు మంజూరు చేయలేదని యువకులు ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలంలోని పలు గ్రామాల్లో.. తుంగతుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హాలియలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిడమనూరు మండలానికి చెందిన.. పలువురు కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యే నోముల భరత్ సమక్షంలో.. బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్షకులకు కరెంట్ కోతలు తప్పవని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ కాలనీలో.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.