Graduate Is Cultivates Vegetables In Jagityala : చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో కన్నవారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన సుమన్. అలాగే చదువుల్లోనూ రాణించేవాడు. 2015లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి.. కొన్నాళ్లు గూగుల్ నావిగేషన్ ప్రాసెసర్‌గా ఉద్యోగం చేసి.. చాలీచాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మనసుకు నచ్చిన పనిచేస్తే బాగుంటుందని భావించి.. ఆ కొలువును వదిలేసి మరీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వ్యవసాయం సాగులోకి అడుగుపెట్టాడు.
ఆ బాటలో మొదటగా ఎలాంటి సాగు చేయాలని ఆలోచించాడు. వరి పండిస్తే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయని అంచనా వేసుకొని.. ప్రస్తుతం మార్కెట్లో ఏ ఏ పంటలకు డిమాండ్ ఉందో తెలుసుకున్నాడు. ప్రస్తుతం జగిత్యాల ప్రాంతంలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉందని గ్రహించి.. తనకు తండ్రి నుంచి వచ్చిన ఎకరం భూమిలో తీగజాతి పంట బీరకాయ సాగును ప్రారంభించాడు. ఈ పంట అయితే అక్కడి వాతావరణానికి సరిపోతుందని భావించాడు. అందులోనే అంతరపంటగా టమోటా, చిక్కెడు వంటి వాటిని పండిస్తున్నాడు. ఇప్పటివరకు బాగానే దిగుబడి వస్తూ.. రోజుకు బీరకాయ క్వింటా మేర కాపు కాస్తోందని సుమన్ తెలిపాడు. మంచి రాబడులు సంపాదించిన తర్వాత.. పంటను విస్తరించడానికి కూనుకున్నాడు. ఒక ఎకరం నుంచి రెండెకరాలకు సాగును వృద్ధి చేశాడు.
"నాకు చదువు అయిపోయిన తర్వాత ప్రయివేట్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ జాబ్ నచ్చక ఇంటికి తిరిగి వచ్చి.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వ్యవసాయం మొదలుపెట్టాను. ఇప్పుడు లాభాలు అనేవి వస్తున్నాయి. వరి కంటే తీగజాతి కూరగాయలు ఎక్కువ లాభాలు ఇస్తున్నాయి. 2015లో ఎకరాతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు రెండు ఎకరాల వరకు విస్తరించింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెటింగ్‌కు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. రోజును నేను క్వింటా బీరకాయలు మార్కెట్లో అమ్ముతున్నాను."- సుమన్, యువ రైతు