Students of regional sports school: కరీంనగర్ పట్టణ శివారులోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు సుమారు 194 మంది విద్యార్థులు ఉన్నారు. వివిధ క్రీడాంశాల్లో రాష్టస్థాయిలో ప్రతిభచూపిన వారికి ఈపాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు. ఇందులో ప్రవేశం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్దులు పోటీ పడతారు. గతంలో ఈపాఠశాలను పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించేవారు.
ఈమద్యలోనే పట్టణ శివారులో సొంత భవనానికి మార్చారు. క్రీడా మైదానం,వసతి గృహాలు నిర్మించి పాఠశాలను ఇక్కడకు తరలించినట్లు అధికారులు చెబుతున్నా పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పోషకాహారం లేకపోవడం సరిగా సాధన చేయలేకపోతున్నామని, ఇలాగైతే పతకాలు ఎలా సాధించగలమని గోడు వెల్లగక్కుతున్నారు.
ఆదివారం పాఠశాలలో ఆహరం సరిగ్గా లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే మరుసటి రోజు సైతం నాసిరమైన అల్పాహారం వడ్డించడంతో తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈవిషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు సైతం పాఠశాలకు వచ్చి వారి నిరసనలో పాల్గొన్నారు. సుమారు ఏడున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన సింథటిక్ ట్రాక్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.