పట్టుదలతో కృషి చేస్తే ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా లక్ష్యం చేరుకోచ్చని నిరూపించిందీ యువతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన చందూ లావణ్య.. ఆటపై ఉన్న మక్కువతో అంతర్జాతీ య వాలీబాల్ క్రీడాకారిణిగా ఎదిగింది. కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ సబ్ ఏషియన్ అండర్-20లో భారత్ నుంచి పాల్గొన్న 14 మంది క్రీడాకారుల్లో...తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక అమ్మాయిగా నిలిచి పోటీలో తనదైన ప్రతిభ కనబర్చింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంతర్జాతీయ వాలీబాల్ ప్లేయర్‌గా రాణిస్తున్న చందూ లావణ్యది మహబూబాబాద్ జిల్లా జయపురం స్వస్థలం. తండ్రి దివ్యాంగుడు కావడంతో తల్లి కూలీ పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అలాంటి దుర్భర పరిస్థితులు చూసిన లావణ్య ఎలాగైనా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్మల కష్టాలను దూరం చేయాలనుకునేది.
టాలెంట్ ఉన్న చాలా మంది ఉన్నారు. కానీ సపోర్ట్ చేసేవాళ్లు ఉండరు. తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే... చాలా మంది క్రీడాకారులు బయటకు వస్తారు. నాలాగా ఎంతో మంది ముందుకు వెళ్లాలి. మా నాన్న ఆశించేది నేను మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నారు. అది నేను నేరువేర్చుతా... నాడ్రీమ్లో 50 శాతం పూర్తి అయింది.. ఇంకా ముందు ముందు సీనియర్ ఇండియా కచ్చితంగా ఆడుతా... మా సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. - చందూ లావణ్య, అంతర్జాతీయ వాటీబాల్ క్రీడాకారిణి
క్రీడల పట్ల ఆసక్తి లేనప్పటికి విశ్రాంత క్రీడోపాధ్యాయుడు వీరారెడ్డి నిర్వహించిన వాలీబాల్ శిక్షణ శిబిరానికి వెళ్లేది లావణ్య. అంతకు ముందు అదే గ్రామానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డికి అర్జున అవార్డు రావడంతో గ్రామస్థులు ఆ అమ్మాయి విజయాన్ని ఒక వేడుకలా నిర్వహించి ఊరేగింపు చేశారు. అప్పటి వరకు వాలీబాల్‌ను ఆటవిడుపుగా చూసిన లావణ్య తన కళ్ల ముందు జరిగిన ఊరేగింపు... ఆ క్రీడాకారిణికి లభించిన గౌరవంతో... ఎప్పటికైనా ఆ స్థాయికి ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదే సంకల్పంతో అప్పటి వరకు బాల్ అందించడానికే పరిమితం అయిన యువతి నాటి నుంచి ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటుగా శిక్షణ తీసుకోలేని లావణ్య.. ఇంటర్లో కరీంనగర్ జిల్లా చింతకుంటలోని గురుకుల జూనియర్ కళాశాలలోవాలీబాల్ శిక్షణ అందిస్తున్నారని తెలుసుకొని అక్కడ చేరింది. శిక్షణ సమయంలో కుటుంబ సభ్యులు ప్రోత్సహించే వారు కాదని జాతీయస్థాయి లో 8సార్లు గెలిచాక వారికి తనపై నమ్మకం కలిగిందని అంటోంది లావణ్య.
నాకు ప్రాక్టీస్ కావాలని.. ఇక్కడ చింతకుంటకు వచ్చా.. ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నా... ఆ తర్వాత వైజాగ్‌లో జాయిన్ అయ్యాను. ఇంటర్ సెకండియర్‌కు వచ్చా... ఆ తర్వాత కజకిస్తాన్ అవకాశం వచ్చింది. పాస్ పోర్ట్ లేకుండే. డబ్బులు కూడా లేవు. అప్పుడు మా గురువు వీరారెడ్డి సపోర్ట్ ఇచ్చి... కజకిస్థాన్‌కు పంపించారు. - చందూ లావణ్య, అంతర్జాతీయ వాటీబాల్ క్రీడాకారిణి