ఈటల రాజేందర్ (ETELA RAJENDHAR) బలమైన అభ్యర్థి. అందులోనూ సిట్టింగ్ స్థానం. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం. రెండుసార్లు మంత్రిగా సేవలు. అలాంటి అభ్యర్థిని ఢీకొట్టడం అంటే అంత సులువుకాదు. అందులోనూ రాష్ట్రంలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న భాజపాకు అందివచ్చిన అస్త్రంగా మారారు. ఈ పరిణామాలన్నీ అంచనా వేసిన గులాబీ దళం. ఈటలకు ఎలాగైనా చెక్‌పెట్టాలని శాయశక్తులా ప్రయత్నించింది. భాజపా సైతం ఈటల వంటి నేత ఓటమి పాలైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించింది. ఈటల విజయం కోసం అలుపెరగని పోరాటం చేసింది.
ఫలించని 'దళితబంధు' వ్యూహాం
దళితబంధు పథకం హుజురాబాద్ ఉపఎన్నిక (HUZURABAD BYPOLL) నేపథ్యంలో ప్రధానంగా తెరపైకి వచ్చింది. దళితులకు 10 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇక్కడ పథకం అమలు చేసి తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపింది. కొందరు లబ్ధిదారులకు యూనిట్లను అందజేసింది. ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకం తెరపైకి తెచ్చారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ మరో నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని పథకం అమలు చేస్తామని సర్కార్ ప్రకటించింది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ గెలుపోటములతో సంబంధం లేకుండా పథకం అమలు కొనసాగిస్తామంది. దళితులతోపాటు ఇతర వర్గాలకూ పథకం అమలు చేయాలనే డిమాండ్లు తెరపైకి రాగా క్రమంగా విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
హోరాహోరీ ప్రచారం...
దళిత బంధు పథకం అమలు నిలిపివేత తెరాస-భాజపా మధ్య విమర్శలకు తావిచ్చేలా చేశాయి. ఎన్నికల సంఘానికి భాజపా నేతలు లేఖలు రాశారని గులాబీ దళం ఆరోపించగా.. అవి నకిలీవంటూ కమలనాథులు తిప్పికొట్టారు. ఈసీ తీరును స్వయంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారం విషయంలోనూ అడ్డుపడుతోందని ప్లీనరీ వేదికగా ఆరోపించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గం ఆవల సభ నిర్వహించకుండా చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు అనుమతిచ్చి సీఎం సభ నిర్వహించకూడదని చెప్పడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. తాను ప్లీనరీ వేదికగా చేస్తున్న ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని దీన్ని ఎలా అడ్డుకోగలరని ప్రశ్నించారు.