తెలంగాణ

telangana

ETV Bharat / state

రెక్కల కష్టమే పెట్టుబడి.. ఐఐటీలో ప్రవేశమే ఫలితం - poor girls cracked in JEE Advanced

వెన్నెల తల్లి ఓ స్కూల్‌కి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఆమెని చదివించింది. హరిత తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు. పావని తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలే! ఎన్నో కష్టాలమధ్య ఉండి కూడా వీళ్లెవ్వరూ ఆడపిల్లల్ని భారంగా చూడలేదు. వారి శక్తిసామర్థ్యాలని నమ్మారు. రెక్కల కష్టాన్నే పెట్టుబడిపెట్టి చదివించారు. ప్రతిఫలమే.. వెన్నెల, హరిత, పావనిలు జేఈఈ అడ్వాన్స్డ్‌లో ర్యాంకులు సాధించి ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందారు. అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంటున్నారు.

International Day of the Girl Child
ఫేదింటి నుంచి ఐఐటీకి

By

Published : Oct 11, 2020, 10:08 AM IST

ఛార్జీలకు డబ్బులు లేక..

వెన్నెల ఆ ఇంట్లో అందర్లోకీ చిన్న. అయితేనేం పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుని సాధించింది.

కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్‌ మావూరు. అమ్మ పద్మజ, నాన్న వెంకటస్వామి. నాన్నకు ఆరేళ్ల కిందట పక్షవాతం వచ్చి కాలూ, చేయి పనిచేయలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి నడుస్తున్నాడు. దాంతో గత కొన్నేళ్లుగా కుటుంబ భారమంతా అమ్మే మోస్తోంది. అమ్మ మోడల్‌ స్కూల్లో వాచ్‌మెన్‌. కొవిడ్‌ వల్ల.. ఇప్పుడు అమ్మకు జీతం కూడా సరిగా రావట్లేదు. నాన్నకు వచ్చే పింఛన్‌తోనే ఇంటిని నెట్టుకొస్తున్నాం. అన్నలతోపాటూ నన్నూ చదివించేందుకు అమ్మానాన్నలు ఎన్నో కష్టాలు పడ్డారు.

వసతి గృహాల్లో ఉండి చదువుకుంటే అమ్మానాన్నలకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదని మా అన్నయ్యలు హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో సీట్లు తెచ్చుకున్నారు. వాళ్లే నాకు స్ఫూర్తి. పెద్దఅన్నయ్య సూర్యుడు ఎం.ఏ. ఇంగ్లిష్‌ చేస్తున్నాడు. చిన్నఅన్నయ్య చంద్రుడు ఐఐటీ దిల్లీలో చదువుతున్నాడు. నేనుకూడా నాలుగో తరగతి నుంచీ ప్రభుత్వ హాస్టల్లోనే చదువుతున్న. అమ్మానాన్నలు వాళ్లు తినకుండా, అప్పులు చేసి మాకు డబ్బు పంపించేవాళ్లు. నా దగ్గరకు వచ్చేందుకు కూడా బస్సు ఛార్జీలకు డబ్బులు చాలక రెండు నెలలకోసారి వచ్చేవాళ్లు. ‘బిడ్డా. మంచిగ చదువు.. ఆశలన్నీ నీ మీదే’ అని అన్నప్పుడల్లా నాకు ఎక్కడలేని ఏడుపొచ్చేది. దాంతోపాటూ సాధించాలనే కసి పెరిగేది. పదోతరగతిలో 9.7 జీపీఏ రాగా..ఇంటర్‌లో 922 మార్కులు వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదివా. అక్కడే జేఈఈకీ శిక్షణ ఇచ్చారు. మెయిన్స్‌లో 3144 ర్యాంకు రాగా.. అడ్వాన్స్డ్‌లో 1931వ ర్యాంకు వచ్చింది. మద్రాస్‌ ఐఐటీలో సీటు దొరుకుతుందనుకుంటున్నా. ఎంటెక్‌ చేసి సొంత సంస్థను ఏర్పాటు చేయాలనుంది. ఏం చేసినా అమ్మానాన్నల జీవితంలో వెన్నెల కురిపించాలనేదే నా లక్ష్యం.

ఇంటిని జప్తు చేసినా చెప్పలేదు!

కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ...ఎంతో నిబ్బరంగా చదివి 1,187వ ర్యాంకు సాధించింది హరిత.

మాది హైదరాబాద్‌. నాన్న చెన్నయ్య కంటోన్మెంట్‌ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా, అమ్మ ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. నేనే పెద్ద. ‘వీళ్లకి పెళ్లిళ్లు చేసేస్తే బాధ్యత తీరిపోతుంది’ అన్నట్టుగా అమ్మానాన్న ఎప్పుడూ ఆలోచించలేదు. మేం బాగా చదవాలని ఆశించారు. నేను ఆరో తరగతిలో ఉండగా ప్రభుత్వ హాస్టల్‌లో చేరిస్తే ఉండలేక వచ్చేశాను. ఖర్చుకు వెనకాడకుండా నాన్న కొంపల్లిలోని ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు.

టెన్త్‌లో 9.8 జీపీఏ సాధించా. ఇంటర్‌ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో చదివా. అక్కడ ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు తరగతులుంటే.. అక్కడ నుంచి రాత్రి ఒంటిగంట వరకూ చదివేదాన్ని. నేను ఇంజినీరింగ్‌ చేయాలనేది నాన్న ఆశ. మా చిన్న చెల్లికి ఆరోగ్యం బాగోదు. దాంతో అమ్మానాన్నలు తెచ్చే జీతం మందులకే సరిపోయేది. దాంతో ఇంటికోసం తెచ్చిన రుణాన్ని తీర్చలేకపోయారు. మా ఇంటిని జప్తు చేశారు. కొన్ని రోజులుపాటు అమ్మానాన్న, చెల్లెళ్లు బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఇవేవీ నాకు మొదట తెలియనివ్వలేదు. తెలిశాక ఈ కష్టాల నుంచి బయటపడటానికి అన్నట్టుగా చాలా కసిగా చదివా. జేఈఈ అడ్వాన్స్డ్‌లో 1,187 ర్యాంకు వచ్చింది. హైదరాబాద్‌ లేదా మద్రాసు ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నా. తర్వాత మంచి ఉద్యోగం చేస్తా. అమ్మానాన్నలను, చెల్లెళ్లను బాగా చూసుకుంటా.

నాకోసం రెక్కలుముక్కలు చేసుకుని..

తాము చదువుకోకపోయినా కూతుర్ని బాగా చదివించాలని ఆశపడ్డారా తల్లిదండ్రులు. ఎస్టీ కేటగిరీలో 841వ ర్యాంకుతో వారి కలల్ని నిజం చేసింది పావని.

మాది నల్గొండ జిల్లాలోని వెంకటాద్రిపాలెం గ్రామం. నాన్న గోలియా నాయక్‌, అమ్మ కోమిటికి మేమిద్దరం ఆడపిల్లలం. నేను చిన్న. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఎలాగైనా పెద్దచదువులు చదివి ఉద్యోగం చేయాలనిపించేది. అమ్మానాన్న వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నా చదువుకోమంటూ పోత్సహించేవారు. టెన్త్‌లో 9.5 జీపీఏ తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్‌కి వరంగల్‌లోని గురుకుల బాలికల ప్రతిభా కళాశాలలో చేరి 975 మార్కులు సంపాదించా. మా లెక్చరర్లు గొప్పగా చెప్పడంతో నాకు ఐఐటీపై ఆసక్తి పెరిగింది. మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో రోజూ 15-16గంటలపాటు చదివేదాన్ని. అమ్మానాన్న గుర్తొస్తే చదవాలనే తపన ఇంకా ఎక్కువయ్యేది.

లాక్‌డౌన్‌తో ఇంటికి వచ్చాక వారానికి రెండుసార్లు ఆన్‌లైన్‌లో పరీక్షలు పెట్టేవారు. ఇంట్లో కూడా హాస్టల్‌లో ఉన్నట్లుగానే క్రమశిక్షణతో చదువుకునేదాన్ని. అమ్మ నన్ను ఇంటిపని అస్సలు చేయనిచ్చేది కాదు. అలా అడ్వాన్స్డ్‌లో 841వ ర్యాంకు వచ్చింది. ఏదైనా ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చేస్తా. నాకీ ర్యాంకు రావడానికి కారణం మా అమ్మానాన్నల కష్టమే. పెద్ద ఉద్యోగం చేసి వాళ్లకి మంచి పేరు తెస్తా.

ABOUT THE AUTHOR

...view details