తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు... ముందు జాగ్రత్త చర్యలే రక్ష - Summer Fire news

గడ్డివాము నిప్పంటుకోవడం.. దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌.. గోదాము బుగ్గిపాలు.. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాల గురించి తరచూ వింటుంటాం.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. పెను నష్టం తప్పదు. అందుకే అగ్నిప్రమాదాల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. నివాస గృహాల్లో, దుకాణాల్లో, ఆసుపత్రులు, గోదాముల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పరికరాలను సమకూర్చుకోవడంపై యాజమాన్యాలు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో వేసవిలో అగ్ని ప్రమాదాలు.. నివారణ చర్యలపై ప్రత్యేక కథనమిది..

DOC Title * special-story-about-summer-fire-accidents-in-karimnagar-district
వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు... ముందు జాగ్రత్త చర్యలే రక్ష

By

Published : Mar 13, 2020, 11:54 AM IST

పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌మాల్స్‌, గోదాములు, తాత్కాలిక పందిళ్లలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడితే వీటిలో ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తలు..

  1. పాఠశాలలు, షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రుల్లో ఆర్‌సీసీ, కాంక్రీట్‌ శ్లాబులను మాత్రమే పై కప్పుగా వాడాలి.
  2. ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమెటిక్‌ స్ప్రింక్లర్లను ఉపయోగించాలి.
  3. వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు క్షేమంగా తప్పించుకునేందుకు సరైన ప్రణాళికలు రచించి అందరికి తెలిసేలా తగు ప్రదేశంలో ఉంచాలి.
  4. షార్ట్‌ సర్య్కూట్‌ జరిగినపుడు అగ్ని ప్రమాదం సంభవించకుండా మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్స్‌ అమర్చాలి.

గిడ్డంగులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. స్టాకును చెక్క స్లీపర్లపై మాత్రమే నిల్వ ఉంచాలి.
  2. వివిధ రకాల వస్తువులకు స్టోరేజ్‌ అరల్లో వేరువేరుగా నిల్వ చేయాలి.
  3. తగినంత నీరు, అగ్నిమాపక సాధనాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
  4. వస్తువుల నిల్వలు 4.5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ నిల్వ చేయరాదు. పై కప్పుకు స్టాకుకు మధ్య కనీసం రెండడుగుల దూరం ఉంచాలి.

అందుబాటులో అగ్నిమాపక సాధనాలు

ఆధునిక సాంకేతిక పరికరాలు అగ్నికీలలు పరిశ్రమ మొత్తం వ్యాపించక ముందే పొగను గుర్తించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. నిప్పును గుర్తించగానే ఇతర కార్మికులను హెచ్చరించేందుకు అలారం అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమలో కప్పుల నుంచి నీటి జల్లులు కురిపించే పరికరాలు లభిస్తున్నాయి. పరిశ్రమల్లో తయారు చేసే వస్తు గుణానికి అనుగుణంగా అగ్నిమాపక నిరోధకాలు లభిస్తున్నాయి. ఇందులో పొడి రసాయనాలు, నురుగ, కార్బన్‌ డై ఆక్సైడ్‌ తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అత్యాధునిక సాంకేతిక సాధనలతో కూడిన ఫైర్‌ ఫ్యాకెట్స్‌, గ్యాస్‌ఫ్లడ్స్‌ తదితర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇలా చేస్తే ప్రాణాలతో బయటకు..

  • మౌనంగా ఉండాలి. భయాందోళనలకు గురికాకూడదు. పరుగులు తీస్తూ గందరగోళ పరిస్థితి సృష్టించరాదు.
  • బిగ్గరగా అరిచి ఆవరణలోని ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయాలి. తప్పించుకుని సహాయం కోసం అర్థించాలి.
  • ప్రమాదం నుంచి బయటపడే సందర్భంలో మెట్ల మార్గాన్ని ఉపయోగించాలే తప్ప లిఫ్టును ఉపయోగించరాదు.
  • అగ్ని ప్రమాదం నుంచి సులువుగా బయటపడే మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలి.
  • ఒకవేళ పొగలో చిక్కుకుంటే వెంటనే నేలపై బోర్లా పడుకొని ముక్కును నేలకు దగ్గరగా ఉంచి ఎగ్జిట్‌ పాయింట్‌ వైపు పాకుతూ వెళ్లాలి.
  • చేతిరుమాలును, ఇతర శుభ్రమైన బట్టను తడిపి నోటికి, ముక్కుకు కట్టుకుంటే పొగ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధించబడతాయి.
  • ఏ కారణంగానూ తగలబడుతున్న భవనంలోకి తిరిగి ప్రవేశించరాదు.

పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువ..

జిల్లాలో చిన్న పెద్ద పరిశ్రమలు సుమారు 8087 ఉన్నాయి.. ఇందులో అధిక విద్యుత్తు వాడుతున్న పరిశ్రమలు 447 ఉన్నాయి.. వేసవిలో అజాగ్రత్త వహిస్తే భారీ నష్టం తప్పదు.. గతేడాది కరీంనగర్‌ కోర్టుచౌరస్తాలోని ఓ షోరూంలో అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. అందుబాటులో అగ్నిమాపక సాధనాలు ఉంటే నష్టం తగ్గే అవకాశం ఉండేది.

ఇవి పాటిస్తే ప్రమాదాలు దూరం

  • ప్రమాదకరమైన వస్తువులు, రసాయనాలు, త్వరగా అంటుకునే స్వభావం ఉన్న పరిశ్రమలు తప్పని సరిగా జనావాసాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల్లోనే స్థాపించాలి.
  • పరిశ్రమల్లో యంత్రాలు, సరకు, ముడి సరకు నిల్వలను వేరువేరు గదుల్లో ఏర్పాటు చేయాలి. వీటి మధ్య దూరం కనీసం 10 మీటర్లు తప్పనిసరి.. ఇక అంటుకునే స్వభావం ఉన్న వస్తువుల తయారీ పరిశ్రమల్లో 25 నుంచి 45 మీటర్ల మద్య దూరం తప్పనిసరి..
  • ప్రతి పరిశ్రమకు అగ్ని నిరోధక పరికరాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. నీటిని చిమ్మడానికి(ఫైర్‌ ఫిట్టింగ్‌ సిస్టం) ఉండాలి.
  • ప్రతి యంత్రానికి రక్షణ కవచం(సేఫ్టీ డివైజ్‌) తప్పనిసరిగా ఉండాలి. తద్వారా యంత్రం నుంచి ప్రమాదం తలెత్తితే రక్షణ కవచం స్పందించేందుకు అవకాశం ఉంటుంది.
  • పరిశ్రమలో భూగర్భ జలాశయం(అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్‌) ఉండాల్సిందే. దీనికి ప్రత్యేకంగా మోటార్లు అమర్చి నీటిని చిమ్మడానికి ఏర్పాటు చేసిన పైపులకు అనుసంధానించేలా ఉండాలి.
  • ఫైర్‌ హౌజ్‌ బాక్స్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దీంతో పాటు అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
  • ప్రమాద సమయంలో ప్రత్యేక రక్షణ పొందడానికి సర్క్యూట్‌ బ్రేకర్లు, విద్యుత్తు వైరింగ్‌ కోసం ఐఎస్‌ఐ మార్కు కలిగిన కేబుళ్లను మాత్రమే వాడాలి.

గృహాల్లో ప్రమాదాలు..

ఇళ్లల్లో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలి. వంట గదిలో అజాగ్రత్త, విద్యుత్‌ గృహోపకరణాలు ఉపయోగించడం, నూనెలు, గ్యాస్‌ వంటి ప్రమాదకరమైన వస్తువులు నిల్వ ఉంచడం, మండే పదార్థాలను ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేయడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..

  1. స్టౌవ్‌ను నేలమట్టానికి వీలైనంత ఎత్తులో పెట్టి ఉపయోగించాలి. అగ్గిపెట్టెలు, కిరోసిన్‌ నిల్వలు స్టవ్‌కు దూరంగా ఉంచాలి.
  2. వంటచేసే సమయంలో వదులుగా, వేలాడు వస్త్రాలను ధరించరాదు. నిప్పు వెలిగించిన తర్వాతే గ్యాస్‌ బర్నల్‌ నాబ్‌ను తిప్పాలి.
  3. మహిళలు వంట చేసే సమయంలో ఫోన్‌ మాట్లాడటం, టీవీ చూడటం ఇతర పనులు చేయకూడదు. వంట గదిలో పిల్లల కదలికలను నిరంతరం పరిశీలించాలి.
  4. సిలిండర్‌ వాల్వ్‌, పైపును, రెగ్యులేటర్‌ను నిర్ణీత కాలపరిమితిలో తనిఖీ చేసి లోపాలు ఉంటే వాటిని మార్చాలి. వంట పూర్తయిన తర్వాత గ్యాస్‌ సరఫరా నిలిపివేయాలి.
  5. ఐఎస్‌ఐ మార్కు కలిగిన విద్యుత్‌ తీగలను మాత్రమే ఉపయోగించాలి. త్రీపిన్‌ సాకెట్‌, ఎర్త్‌ తప్పనిసరిగా వాడాలి.
  6. గృహం నుంచి ఎక్కువ సమయం బయటకు వెళ్లేటప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. షార్ట్‌ సర్యూట్‌ అయినప్పుడు వెంటనే మెయిన్‌ ఆఫ్‌ చేయాలి.
  7. విద్యుత్తుకారక అగ్ని ప్రమాదం జరిగినపుడు నీటితో మంటలు ఆర్పరాదు. ఒకటికి మించి ఎక్కువ పరికరాలను ఒకే సాకెట్‌లో అనుసంధానం చేయరాదు.
  8. ప్రాథమిక అగ్నిమాపక పరికరాలను ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ప్రమాదం జరిగినపుడు భయపడకుండా పరికరాలతో ఆర్పేయాలి.

ABOUT THE AUTHOR

...view details