హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా - దళిత బంధు వార్తలు
17:38 August 13
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకానికి ఆదిలోనే నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అయితే కందుగుల గ్రామంలో దళిత బంధు పథకంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈనెల 16న శాలపల్లిలో జరిగే సీఎం సభలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామం నుంచి 8 మందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆ గ్రామంలోని ఎస్సీలు రగిలిపోతున్నారు. లబ్దిదారుల జాబితాతో దళితవాడకు వచ్చిన అధికారి నుంచి జాబితాను లాక్కొని చింపివేశారు. గ్రామంలో 150 మంది వరకు ఎస్సీలు ఉండగా కేవలం 8 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడమేమిటని తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ధర్నాకు దిగారు. హుజూరాబాద్-పరకాల రహదారిపై ఎస్సీ కాలనీ వాసులు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పథకంలో తమ పేర్లు చేర్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అటు వీణవంక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్సీలు ఆందోళన చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి:Huzurabad by election : హుజూరాబాద్‌లో ఊహకందని పోరు.. ప్రచారంలో వాక్బాణాల హోరు