తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Schools Issues : విద్యార్థులు లేని బడులకు టీచర్ల బదిలీ - తెలంగాణ టీచర్ల బదిలీలో సమస్యలు

Telangana Schools Issues : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులున్న పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులు ఉండట్లేదు. విద్యార్థులు లేని పాఠశాలల్లో మాత్రం ప్రధానోపాధ్యాయులతో సహా, బోధనా సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు. దీనివల్ల బోధించేవారు లేక విద్యార్థులు వేరే బడులకు వెళ్లాల్సిన దుస్థితి. మరోవైపు కొందరు సిబ్బంది.. ప్రతిరోజూ విధులకు హాజరై ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి.

Telangana Schools Issues
Telangana Schools Issues

By

Published : Feb 14, 2022, 7:33 AM IST

  • కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం వచ్చునూర్‌ ఉన్నత పాఠశాల ఇది. ఇటీవల వరకు ఇక్కడ 6-10 తరగతులకు కలిపి తొమ్మిది మంది విద్యార్థులు ఉండేవారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో అయిదుగురు ఉపాధ్యాయులు పనిచేసేవారు. కొత్త జిల్లాల వారీగా కేటాయింపుల్లో భాగంగా ఆ ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. అంటే హెచ్‌ఎం ఒక్కరే ఉన్నారు. ఫలితంగా జనవరి 27న ఇక్కడున్న తొమ్మిది మంది పిల్లలు మూడు కిలోమీటర్ల దూరంలోని నేదునూర్‌ ఉన్నత పాఠశాలలో చేరారు. అయినా హెచ్‌ఎంను మాత్రం బదిలీ చేయలేదు. దాంతో ఆయనతో పాటు అటెండర్‌ రోజూ విధులకు హాజరవుతున్నారు.
  • కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో గత విద్యా సంవత్సరం(2020-21) నుంచి ఒక్క విద్యార్థీ లేరు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడితో పాటు ఒక హిందీ ఉపాధ్యాయుడు పనిచేస్తూ వచ్చారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై మరో పాఠశాలకు పంపారు. ఇక హెచ్‌ఎం శ్రీధర్‌ ఒక్కరే రోజూ విధులకు హాజరవుతున్నారు.

Telangana Schools Issues : పాఠశాల విద్యాశాఖ పనితీరు విమర్శలకు దారి తీస్తోంది. విద్యార్థులున్న పాఠశాలలకు తగినంత ఉపాధ్యాయులను కేటాయించకుండా, విద్యా వాలంటీర్లను నియమించని విద్యాశాఖ.. పిల్లలు ఒక్కరూ లేని ఉన్నత పాఠశాలల్లో మాత్రం ప్రధానోపాధ్యాయులను, బోధనా సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో వారు రోజూ విధులకు వచ్చి ఊరికే కూర్చొని ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ప్రధానోపాధ్యాయులు మాత్రం అధికారుల దృష్టికి తెచ్చామని, ఇంకా బదిలీపై నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. వాటిల్లో కొన్ని చోట్ల సిబ్బంది కూడా పనిచేస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొండపాక హైస్కూల్‌లో నలుగురు విద్యార్థులు ఉండగా ఒకే ఒక్క భౌతికశాస్త్రం ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు.

Telangana Teachers Transfer Issues : రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్‌ పాఠశాలలున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) 475 పనిచేస్తున్నాయి. వీటికితోడు గురుకులాలున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక కేజీబీవీలు, గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా ఆ పాఠశాలలున్న చోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. అయిదు తరగతులకు కలిపి 1-50 మంది లోపు విద్యార్థులు ఉన్న హైస్కూళ్లు 427 వరకు ఉండటం గమనార్హం. వాటిల్లో అధిక శాతం మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు ఉన్న ప్రాంతంలోనివేనని హెచ్‌ఎంలు చెబుతున్నారు.

తక్కువ మంది పిల్లలుంటే పొరుగున ఉన్న బడుల్లో చేర్పించాలి

'కనీస విద్యార్థులు లేని పాఠశాలల్లోని పిల్లలను సమీపంలోని ఇతర బడుల్లో చేర్పించాలి. అక్కడి ఉపాధ్యాయులను సైతం బదిలీ చేయాలి. లేకుంటే విద్యార్థులే నష్టపోతారు. కబడ్డీ ఆట ఆడుకుందామన్నా 14 మంది ఉండాలి. ఆ మాత్రం పిల్లలు లేని ఉన్నత పాఠశాలలూ ఉన్నాయి. ఇక ప్రాథమిక పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. అవసరమైతే రవాణా సౌకర్యం/భత్యం కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలి.'

- రాజభాను చంద్రప్రకాశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం

ABOUT THE AUTHOR

...view details