కరీంనగర్ జిల్లా ఆస్పత్రి కరోనా బాధితులకు వైద్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్య సేవలను ఓ ఏజెన్సీకి అప్పగించారు. దాదాపు 300 మంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొవిడ్ వార్డుల్లో వందల మంది రోగులు వైద్యం తీసుకుంటున్న క్రమంలో మలమూత్రాలు ఎత్తిపోయడం సహా చెత్తను శుభ్రం చేస్తున్నారు. తమ సేవలు నిమిషం ఆలస్యమైనా భరించలేనివారు.. వేతనాల పెంపుపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది క్రితం కరోనా రోగులు వైద్యం కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు భయంతో గజగజలాడేవారని.. అయినా వెనకాడకుండా పని చేశామని పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 3 వేలకుపైగా కరోనా బాధితులకు వైద్యం అందించగా.. తామూ కీలకపాత్ర పోషించామని తెలిపారు. ఏడాది క్రితం తమకు నెలకు రూ.7 వేల రూపాయల వేతనం ఇచ్చారని.. ప్రస్తుతం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.