కరీంనగర్‌లో సహస్ర డబ్బావాలా సేవలు Sahasra Dabbawala Services in Karimnagar: ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గజిబిజీ జీవితంతో ఒకరికొకరు సహాయం చేసుకునే సమయం కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆన్‌లైన్ ఆర్డర్లు, హోం డెలివరీలు పెరిగిపోయాయి. మరోవైపు స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఆహారపదార్థాలను హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఇంటింటికి డెలివరీ చేస్తున్నాయి. తాజాగా డబ్బావాలాలు కరీంనగర్ మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. సహస్ర డబ్బావాలా అనే సంస్థ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు వారింట్లో నుంచి లంచ్ బాక్సును తీసుకెళ్లి అందిస్తోంది.
పిల్లలు సంతోషంగా అన్నం తింటున్నారు:పొద్దున ఎప్పుడో తయారు చేసిన భోజనం.. మధ్యాహ్నానికి చల్లగా అవుతున్నందున పిల్లలకు భోజనం చేయాలన్న ఆసక్తి తగ్గేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనితో పూర్తిగా భోజనం చేయకుండా ఆహారాన్ని వదిలివేసే వారని చెప్పారు. ప్రస్తుతం సహస్ర డబ్బావాలా కిచన్ సంస్థ ద్వారా సమయానికి వేడి వేడి ఆహారం అందుతుంది చెప్పారు. దీంతో పిల్లలు చాలా సంతోషంతో ఆహారం తింటున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ముంబాయి, హైదరాబాద్ తరహాలో కరీంనగర్‌లోని డబ్బావాలా సేవలు అందించడం సంతోషంగా ఉందంటున్నారు.
ఉద్యోగులకు భోజన సదుపాయం అందిస్తున్నాం: రోజుకు 40 మంది విద్యార్థులు, ఉద్యోగులకు వారి ఇంటి నుంచి తెచ్చిన లంచ్ బాక్సులను భోజన సమయానికి 20 నిమిషాల ముందే డెలివరీ బాయిస్ అందిస్తున్నారు. ఈ సంస్థ వారు కొత్తగా క్యారేజీ ప్యాకేజ్ ప్రవేశపెట్టారు. ప్యాకేజీ ద్వారా శాకాహార భోజనాన్ని అందిస్తున్నారు. కేవలం వాళ్లు అందజేసే లంచ్ బాక్సులే కాకుండా ఉద్యోగులకు వారు స్వయంగా వంట చేసుకునేందుకు ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేశారు. వారి ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని.. అనుకూల పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి సంస్థను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
"మేము మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. అక్కడ కూర్చోని అందరం మాట్లాడుకుంటుడగా ఈ ఐడియా వచ్చింది. ఉదయం పాఠశాల 7 గంటలకు మొదలవుతుంది. అప్పుడు పట్టుకెళ్లిన ఆహారం మధ్యాహ్నం తినేసరికి చల్లగా అయిపోతుంది. అందువల్ల వారు ఆహారాన్ని సరిగ్గా తినడం లేదు. మా అన్నయ్య ఈ ఐడియా ఇచ్చాడు. నేను మొదలుపెడదాం అనుకొన్నాను. ఇలాంటి సేవలు పుణెలో, ముంబాయిలో ఉన్నాయని తెలుసుకొని ప్రారంభించాం. ఇది మొదలుపెట్టి రెండు నెలలు అవుతోంది. కిలోమీటర్ల ఆధారంగా చేసుకొని ధరలు నిర్ణయిస్తున్నాం." - మహేందర్, సహస్ర డబ్బావాలా నిర్వాహకుడు
ఇవీ చదవండి: