హైదరాబాద్ సకల జనుల సమరభేరి సభకు వెళ్లి గుండెపోటుతో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ ఎన్.బాబు మృతదేహాన్ని కరీంనగర్ బస్టాండ్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు. మృతదేహాన్ని కరీంనగర్-టూ డిపో వద్దకు తీసుకొచ్చేందుకు కార్మికులు తీవ్ర ప్రయత్నం చేసారు. వారిని బైపాస్ వద్దే అడ్డుకున్న పోలీసులు నేరుగా పార్థివ దేహాన్ని ఇంటికే తీసుకెళ్లాలని సూచించారు. అందుకు జేఏసీ నేతలు ఒప్పుకోకుండా డిపో వద్దకు తీసుకువెళ్లి నివాళులర్పిస్తారమని కోరారు. పోలీసులు నిరాకరించడంతో... కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేసి అంబులెన్స్‌ను నేరుగా ఆరెపల్లిలోని మృతుని ఇంటికి తరలించారు. అరెస్టు చేసిన జేఏసీ నేతలను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.
రాత్రి నుంచే బందోబస్తు ఏర్పాటు
నిజానికి నిన్న సాయంత్రమే మృతదేహాన్ని కరీంగనగర్‌కు తీసుకరావాలని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు అడ్డగిస్తారన్న ఆలోచనతో తెల్లవారుజామున తీసుకొచ్చారు. రాత్రి నుంచి పోలీసులు తమను మభ్య పెట్టారని జేఏసీ నేతలు ఆరోపించారు. రాత్రి నుంచే కరీంనగర్ జిల్లా సరిహద్దులోని శనిగరం, అలుగునూరు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోకు తీసుకువెళ్లనీయకుండా అడ్డుకోవాలని ప్లాన్ వేసారు.