Rice Millers Facing Troubles With New Rules in Joint Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Joint Karimnagar District) వ్యాప్తంగా గత యాసంగి, వానాకాలం సీజన్ల ధాన్యం బస్తాలు మిల్లుల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. సీఎంఆర్ కింద సేకరించిన ధాన్యాన్ని మరాడించాక ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకు అప్పగించాల్సి ఉండగా.. మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. తమకు సంబంధం లేకపోయినా కస్టం మిల్లింగ్‌లో విధిగా ఎఫ్ఆర్‌కే బియ్యం మాత్రమే ఇవ్వాలన్న నిబంధన పెట్టారు. ఈ క్రమంలో కొన్ని సార్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు తిరిగి పంపించడంతో తలనొప్పిగా మారింది.
'రికార్డు స్థాయిలో ధ్యానం కోనుగోలు కేంద్రాలు.. కోటి మెట్రిక్ టన్నుల సేకరణనే లక్ష్యం'
Problems of Millers Due to Storage for Paddy : అసలే తమకు మిల్లింగ్ ఛార్జీలు దశాబ్ద కాలంగా పెంచకపోగా.. కొత్త కొత్త నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారని మిల్లర్లు (Millers ) వాపోతున్నారు. నిల్వ చేసేందుకు గోదాములు లేక చాలా వరకు ధాన్యం ఆరుబయట టార్పాలిన్లు కప్పి పెట్టారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంతో పసుపు రంగులోకి మారిన బియ్యాన్నిఎఫ్‌సీఐ నిరాకరిస్తోందని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పుడైతే అసలు బియ్యాన్ని తీసుకోవటం లేదని.. ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
"నేను గత 33 సంవత్సరాల నుంచి రైస్ మిల్ ఇండస్ట్రీలో ఉన్నా. ఈ సంవత్సరం బాగా గడ్డుకాలం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం అమ్ముతామని టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఐఏఎస్ అధికారుల కమిటీ వేసింది. ఇప్పటి వరకూ ధాన్యం అమ్మడం కానీ కొనడం జరగడం లేదు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రబీ ధాన్యాన్ని టెండర్ల ద్వారా అమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా ఖరీఫ్‌లో ధాన్యాన్ని సేకరించే వీలవుతోంది." - బోయినిపల్లి ప్రభాకర్‌రావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది వానాకాలంలో మొత్తం 11.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (Paddy) 350 మిల్లులకు పంపించారు. ఇందులో 67 శాతం అంటే 7.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 2.46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇక, యాసంగిలో మొత్తం 12.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించగా.. 8.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.