Karimnagar Congress Public Meeting Update: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర' చేస్తున్నారు. తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్ రెడ్డి యాత్రను కొనసాగిస్తున్నారు. జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణులలో నూతనోత్సాహం నెలకొంది. ఈ "హాథ్ సే హాథ్ జోడో యాత్ర"లో భాగంగానే గురువారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఛత్తీస్‌ఘడ్ సీఎం సీఎం భూపేశ్ భగేల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే ముఖ్య అతిధులుగా హాజరైనారు.
వందలాది బిడ్డల ప్రాణ త్యాగాల వల్లే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నో కుట్రలు, అవరోధాలు తిప్పికొట్టి సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ కరీంనగర్‌లోనే ప్రకటించారన్న రేవంత్.. రాజకీయ ప్రయోజనాల గురించి సోనియాగాంధీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.
'కేసీఆర్ వచ్చాక 3 వేల వైన్‌షాపులు, 60వేల బెల్టుషాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా ? బీజేపీ వైపు చూస్తే..పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ మాడల్ అంటే పేదల అభివృద్ధి.. బీజేపీ మాడల్ అంటే గుజరాత్ అభివృద్ధి అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటే.. బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. రైతు బంధు కింద ఇక్కడ ఎకరానికి 5వేలు మాత్రమే ఇస్తున్నారు.. తాము తొమ్మిది వేలు ఇస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అందిస్తున్నామన్నారు.