తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతి భవన్​లోకి వెళ్లాలంటే పాస్​పోర్ట్​, వీసా తీసుకోవాలా: రేవంత్ ​రెడ్డి

Revanth Reddy Fires On CM KCR: అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఈ నెల 9న కరీంనగర్‌లో సభ జరిపి తీరుతామని రేవంత్​రెడ్డి సవాల్ విసిరారు. ప్రగతి భవన్​లోకి వెళ్లడానికి తెలంగాణ ప్రజలకు వీసా అవసరమా అంటూ ప్రశ్నించారు. మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Revanth Reddy Fires On CM KCR
Revanth Reddy Fires On CM KCR

By

Published : Mar 7, 2023, 1:18 PM IST

అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా కరీంనగర్‌లో సభ జరిపి తీరుతాం: రేవంత్​రెడ్డి

Revanth Reddy Fires On CM KCR: మన రక్తం, చెమటతో 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్​లోకి పేదలను ఎందుకు రానివ్వడం లేదని పోలీసుల పహారా మధ్య ప్రగతి భవన్.. పాకిస్తాన్ ఇండియా బార్డర్​ను తలపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విమర్శించారు. ప్రగతి భవన్ పోవాలంటే పాస్ పోర్ట్, వీసా తీసుకోవాలా అంటూ నిలదీశారు. పాదయాత్రలో భాగంగా పూడూరు నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మార్గమధ్యలో రైతులను, బీడీ కార్మికులను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే కవాతు చేస్తాం: తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్న రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​ను గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్​లో సభ పెడతామంటే పోలీసులు అనుమతులివ్వడం లేదని తెలిపారు. కరీంనగర్ గడ్డ మీద సభ జరగనివ్వకుంటే కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9న కరీంనగర్​లోని అంబేడ్కర్ స్టేడియంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గలమెత్తి చాటేందుకు.. ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని ఆయన ఆరోపించారు.

వరుస పాదయాత్రలతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం: నిర్మల్ జిల్లాలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి నాలుగో రోజు చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో, కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర జోరుగా సాగింది. మామడ మండలం కొరటికల్ నుంచి మామడ మండల కేంద్రం వరకు యాత్ర కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలు మోసపోయారంటూ.. ప్రభుత్వంపై మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు వరుస పాదయాత్రలతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. సాధారణ ఎన్నికల తరహాలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

'నేను ఈ వేదిక మీద నుంచి డీజీపీకి చెప్పదలుచుకున్నా.. 15 రోజుల కింద గంగుల కమలాకర్​కు అక్కడినే అనుమతి ఇచ్చినవ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ సభ పెట్టుకుంటానంటే.. నువ్వు తిరస్కరిస్తున్నవ్. ఒక ఆంధ్ర అధికారికి ఎంత ధైర్యమో మీరే ఆలోచన చేయండి. తెలంగాణ నలుమూలల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు, విద్యార్థులకు నేను పిలుపునిస్తున్నా. ఈ నెల 9న నాడు కరీంనగర్​లో కవాతు చేద్దాం. కరీంనగర్ నడి గడ్డన.. కాంగ్రెస్ పార్టీ సభ పెట్టి తీరుతుంది'. -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details