Realtor Commits Suicide in Karimnagar: కరీంనగర్ జిల్లాలో భూవివాదాలు మితిమీరిపోతున్నాయి. భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంతో రియల్టర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా భూమిని విక్రయించాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను పదేపదే బెదిరిస్తున్నారంటూ కరీంనగర్‌కు చెందిన బొడిగె శంబయ్య అలియాస్ శ్యామ్ (55) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు శ్యామ్ సీఐ గోపీకృష్ణ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పది పేజీల లేఖ రాశారు.
సీఐ రవీందర్, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో శ్యామ్ అనే వ్యక్తి భూముల క్రయవిక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలోని బ్యాంకు కాలనీలో నివసిస్తున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ కురికాల గోపీకృష్ణ 8 నెలల కిందట శ్యామ్ మధ్యవర్తిత్వంతో భూపాలపట్నంలో 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. రూ.10 లక్షలు లాభం వచ్చేలా అయిదారు నెలల్లో ఆ భూమిని విక్రయించి ఇస్తానని శ్యామ్ సీఐకు తెలిపారు. టైం దాటినా భూమిని విక్రయించలేకపోవడంతో సీఐ గోపీకృష్ణ రియల్టర్ శ్యామ్‌ను ఒత్తిడి చేశారు. తనకు భూమిని అమ్మిపెట్టడంతో పాటు అదనంగా రూ.10 లక్షల లాభం ఇవ్వాల్సిందేనని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ పట్టుబట్టడంతో రియల్టర్ శ్యామ్ రూ.3 లక్షలు అప్పు చేసి ఆయనకు చెల్లించారు. అదేవిధంగా తన బావ పేరిట సీఐ భూమి కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో భూమి విక్రయించడంతో పాటు జాప్యానికి రూ.10 లక్షలు అదనంగా చెల్లిస్తానని సీఐకి ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారు.
సీఐ ఫోన్ చేస్తే మా నాన్న భయంతో వణికేవారు: ఈ క్రమంలో గోపీకృష్ణ గురువారం ఫోన్ చేసి శ్యామ్‌తో తీవ్రంగా మాట్లాడడంతో కుంగిపోయిన రియల్టర్ శుక్రవారం మధ్యాహ్నం భూపాలపట్నం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆయన... అక్కడ ఉన్న సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఉదయం స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రియల్టర్ శ్యామ్ మృతదేహంపై భార్య, పిల్లలు పడి రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సీఐ గోపీకృష్ణ ఫోన్ వస్తే తన తండ్రి ఇంట్లో భయంతో వణికేవారని, ఆయనను కఠినంగా శిక్షించాలని.. మృతుని కుమారుడు బిట్టు విలపిస్తూ చెప్పాడు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు గోపీకృష్ణపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, ఆయన పరారీలో ఉన్నాడని చొప్పదండి సీఐ రవీందర్ పేర్కొన్నారు.