పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రతినెలా కోటాలో ఎక్కువ శాతం దొడ్డిదారిన నల్లబజారుకు తరలిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సదుద్దేశంతో అందిస్తున్న చౌక బియ్యం విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యం పెరుగుతోంది.
పర్యవేక్షణ లేకపోవడంతోపాటు కఠినమైన చర్యలు కనిపించకపోవడం వల్ల బియ్యం మాఫియా పేట్రేగుతోంది. ఇష్టానుసారమనే తీరుతో లబ్ధిదారులకు అందిన బియ్యంతోపాటు అందించాల్సిన వాటి విషయంలో అక్రమ రవాణా రోజుకింతగా రెక్కలు తొడుగుతోంది. ఫలితంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పట్టుబడిన ప్రతి సందర్భంలో ఇది సాధారణమే అని అనిపిస్తున్నా.. దీని వెనుకలా మాత్రం ఊహించని అక్రమతంతు నాలుగు జిల్లాల పరిధిలో కొనసాగుతోంది.
కనిపించని నిఘా..!
కిలో బియ్యానికి దాదాపుగా రూ.26 చొప్పున రాయితీ భరిస్తూ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 9.66 లక్షల మంది కార్డుదారులకు 29.614 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ కోసం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వీటికి గానూ సుమారుగా రూ.76కోట్ల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.
ఇంత పెద్దమొత్తాన్ని వెచ్చించి చౌకధరల దుకాణాలకు చేరుతున్న వాటిని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల లాక్డౌన్ ఆంక్షల తర్వాత ఉమ్మడి జిల్లాలో తరచూ పోలీసుల తనిఖీల్లో వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం ఆయా ప్రాంతాల్లో పట్టుబడుతోంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సగటున రెండు రోజులకోసారైనా పెద్దమొత్తంలో చౌక బియ్యాన్ని అధికారులు, పోలీసులు పట్టుకుంటున్నారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇలా పట్టుకున్న బియ్యాన్ని స్వాధీన పర్చుకుని వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ రవాణా ఆగడంలేదు. ఇలా ప్రతి నెలలో అందుతున్న కోటాలో ఎంతలేదన్నా సగానికిపైగా నల్లబజారుకు బియ్యం చేరుతోంది. ఈ లెక్కన నాలుగు జిల్లాల పరిధిలో రూ.38కోట్ల విలువైన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది.
పొరుగు రాష్ట్రాలకు రవాణా..
ప్రతి నెలా కార్డుదారుకు 6కిలోల బియ్యాన్ని గతంలో ఇవ్వగా.. ఇటీవల కరోనా ప్రభావంతో ఉచితంగా ప్రతి వ్యక్తికి 12 కిలోలలను అందించారు. ఈ నెల నుంచి 10కిలోల చొప్పున ఇస్తున్నారు. ఇలా ఇస్తున్న బియ్యం విషయంలో దొడ్డిదారిన అమ్మకాల జోరు నాలుగు జిల్లాల్లో ఇంతకింతకు పెరుగుతోంది.