Villagers left their homes: నేటి ఆధునిక కాలంలో చంద్రుని పైన నివాసం ఏర్పరచుకునే దిశగా ప్రయోగాలు సాగుతున్న రోజులివి. కానీ ఇలాంటి రోజుల్లో మూఢనమ్మకాలతో నివాసాలు ఖాళీ చేయటం అనే విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఉదయమే గ్రామస్థులంతా తమ నివాసాలు విడిచి శివారులోని పంట పొలాలు, పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకున్నారు.
ఈ గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావిస్తూ సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పంట పొలాల్లోనే ఉండాలని నిశ్చయించుకున్నాయి. వేద పండితుల సూచన మేరకు గ్రామాన్ని విడిచి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. అంతా బయటకు రావడంతో ఆ గ్రామం ఖాళీగా దర్శనమిస్తోంది.