తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటకు రక్షణగా రాజాంజలి, అంజయ్య ఆవిష్కరణలు - telangana varthalu

ఆరుగాలం శ్రమించి, పండించిన పంటను నాశనం చేస్తూ అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా వేధిస్తాయి అడవి పందులు, మిడతలు. చీడపీడల బెడదను క్రిమిసంహాకారాలతో దూరం చేసుకున్నా... అడవిపందుల ముప్పు తప్పాలంటే మాత్రం రాత్రింబవళ్లు పంటకు కాపలాగా ఉండాల్సిందే. చిన్నప్పటినుంచీ తల్లిదండ్రుల ఇలాంటి బాధలు చూస్తూ పెరిగిన కరీంనగర్‌కు చెందిన యువకుడు అంజయ్య, మరో బాలిక రాజాంజలి.. 2 వేర్వేరు పరిష్కారాలు చూపారు. సాంకేతికత సాయంతో అడవి పందుల బెడదను తప్పించే ఆవిష్కరణలు తెరపైకి తెచ్చారు.

inventions as protection for the crop
పంటకు రక్షణగా రాజాంజలి, అంజయ్య ఆవిష్కరణలు

By

Published : Apr 22, 2021, 11:07 PM IST

పంటకు రక్షణగా రాజాంజలి, అంజయ్య ఆవిష్కరణలు

కరీంనగర్‌కు చెందిన యువకుడు ఇంజపూరి అంజయ్య.. చదివింది 5వ తరగతి మాత్రమే. అదేజిల్లాకు చెందిన రాజాంజలి చదువుతోంది 8వ తరగతే. చిన్నప్పటినుంచీ తమ తల్లిదండ్రులను ఇబ్బందిపెడుతున్న ఓ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని సంకల్పించుకున్నారు. సాంకేతికత సాయంతో వేర్వేరు పరిష్కారాలు చూపారు. చిన్నప్పటినుంచీ రైతుల కష్టాలు చూస్తూ పెరిగిన కుటుంబనేపథ్యమే.. ప్రస్తుతం ఈ ఇద్దరినీ యువ శాస్త్రవేత్తలుగా మలిచింది.

సాంకేతికతతో పనిచేసే అలారం

అంజయ్యకు చిన్నప్పటి నుంచీ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీపై ఆసక్తి ఎక్కువ. వ్యక్తిగత కారణాలతో 5వ తరగతితోనే చదువుకు దూరమైనా... ప్రయోగాలు ఆపలేదు. కన్నవారికి చేదోడుగా వ్యవసాయం పనుల్లో నిమగ్నమైన అంజయ్య.. అడవి జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు...కాపలా కాసేవాడు. ఆ సమస్యతో విసుగెత్తిపోయి సాంకేతికత సాయంతో పనిచేసే అలారం రూపొందించాడు.

5 నిమిషాలకోసారి శబ్దాలు వచ్చేలా..

సర్క్యూట్‌ బోర్డు...స్పీకర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌లు వాడి, అలారం రూపొందించాడు అంజయ్య. 8 గంటల పాటు పనిచేసే ఈ అలారంను ప్రతి 5 నిమిషాలకోసారి శబ్దాలు వచ్చేలా తయారుచేశాడు. బ్యాటరీ, సోలార్‌, విద్యుత్‌‌ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 100రకాల అరుపులు రికార్డు చేసి, ఈ పరికరంలో పొందుపరిచాడు. విద్యుత్‌తో నడిచే అలారం 2500, బ్యాటరీ అలారం 4500, సోలార్ అలారం 7500 రూపాయలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్తున్నాడు.

మిడతలను తరిమేందుకు..

పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లికి చెందిన రాజాంజలి తండ్రి కౌలు రైతు. పంటలు చేతికొచ్చే సమయంలో జంతువులు, పక్షుల వల్ల తీవ్రంగా నష్టపోవడం చూస్తూ పెరిగింది. ఎలాగైనా తండ్రి కష్టం తీర్చాలనుకుంది. రాజస్థాన్‌‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల రైతులు మిడతలను తరిమేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీవీలో చూసి.. బుర్రకు పదునుపెట్టింది. ఇంటర్నెట్‌, ఉపాధ్యాయుల సహకారంతో పరిశోధన చేసి, సెన్సర్‌ లౌడ్‌ స్పీకర్‌‌కు రూపకల్పన చేసింది.

జంతువులను గుర్తించగానే..

గుంపులుగా వచ్చే అడవి జంతువులు, కోతులు, మిడతలను దూరం నుంచే గమనించేలా పరికరం రూపొందించింది రాజాంజలి. ఆ అలారం జంతువులను గుర్తించగానే... అప్పటికే రికార్డు చేసిన శబ్దాలను వినిపిస్తుంది. ఫలితంగా జంతువుల బెడద పూర్తిగా పోతుందని చెప్తోందీ బాల శాస్త్రవేత్త. రాజాంజలి ఆవిష్కరణకు రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో మంచి గుర్తింపు లభించింది.

పంటతో పాటు ప్రాణులకు రక్షణ

రాజాంజలి రూపొందించిన అలారం రైతుల మన్ననలు పొందుతోంది. అడవి పందులు పంటల్లోకి రాకుండా నిలువరించేందుకు కొందరు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తారు. వాటివల్ల జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. కానీ...ఈ పరికరం వల్ల అటు జంతువులకు, ఇటు పంటకు ఎలాంటి నష్టం జరగడం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల చిన్నచిన్న సమస్యలకు పరిష్కారాలు చూపే ప్రయత్నాల్లో మునిగిపోయారు రాజాంజలి, అంజయ్య. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలకు ప్రాణం పోస్తామని చెప్తున్నారు.

ఇదీ చదవండి: బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక

ABOUT THE AUTHOR

...view details