తెలంగాణ

telangana

ETV Bharat / state

కొట్టుకుపోతున్న కర్షకుల కష్టం.... కానరాని కొనుగోలు కేంద్రం... - unseasonal showers in karimnagar

భూమిని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరనే పాతకాలం నమ్మకం నేడు జలసమాధి అవుతోంది. విత్తు దశ నుంచి పంట సొమ్ము చేతికొచ్చే వరకు దినదిన గండంగా ఉంది. కరీంనగర్​, పెద్దపల్లి జిల్లాల్లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికందిన పంట నీటిపాలవుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్లెదుటే కొట్టుకుపోతుంటే అన్నదాత గుండె చెరువు అవుతోంది.

కొట్టుకుపోతున్న రైతుల కష్టం.... కానరాని కొనుగోలు కేంద్రం

By

Published : Oct 26, 2019, 5:52 AM IST

Updated : Oct 26, 2019, 3:47 PM IST

కొట్టుకుపోతున్న రైతుల కష్టం.... కానరాని కొనుగోలు కేంద్రం

ప్రకృతి బీభత్సాలతో అన్నదాత రోజురోజుకు కుదేలైపోతున్నాడు. అతివృష్టి రైతన్న చేత కన్నీరు పెట్టిస్తోంది. కరీంనగర్​, పెద్దపల్లి జిల్లాల్లో పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు వర్షార్పణం అవుతున్నాయి. గతంలో కంటే ఈ సారి వానలు బాగా కురిసాయి... పంటలు బాగా పండాయన్న ఆనందాన్ని వరుణుడు తుడిచిపెట్టేస్తున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్న ప్రభుత్వం అలసత్వంతో కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. కంటికి రెప్పలా కాచుకుని తెచ్చిన పంట కళ్లెదుటే కొట్టుకుపోతుంటే రిక్తహస్తాలతో నిలవడమే మిగిలింది.

కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోతున్న ధాన్యం

గంగాధర మార్కెట్‌ ‌యార్డులో కొనుగోలు కేంద్రం ఇంతవరకు ప్రారంభించలేదు. ధాన్యం మార్కెట్‌కు తీసుకురావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. పంటను ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థంకాని పరిస్థితి. వర్షమొస్తే కప్పేందుకు టార్పాలిన్లు కూడా లేవని... ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియడం లేదని కర్షకులు వాపోతున్నారు.

అప్పుడు ఎండిపోయింది... ఇప్పుడు మునిగిపోయింది

మరోవైపు చేతికొచ్చిన పంట నీట మునగి ఆందోళన మిగుల్చుతోంది. యాసంగిలో నీరు లేక ట్రాక్టర్లతో తెప్పించి పంటలను కాపాడుకుంటే... ఇప్పుడేమో కళ్ల ముందే నీట మునిగి కుళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని... వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కంకులు కుళ్లిపోయాయి... గింజలు రాలిపోయాయి

Last Updated : Oct 26, 2019, 3:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details