చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్న నానమ్మ
ఒక్క రోజు బడికి పోలేదు.. పలకా బలపం పట్టలేదు.. అఆలు, ఏబీసీడీలు వల్లెవేయలేదు.. ఒకటి రెండ్లు నేర్వలేదు.. 1వ తరగతిలో చదువులు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు అయినప్పటికీ వారు రెండో తరగతికి ప్రమోట్ అవుతున్నారు. ఇదీ 2020-21వ విద్యాసంవత్సరంలో జిల్లాలోని సర్కారు బడుల్లో 1వ తరగతిలో పేర్లు నమోదు చేసుకున్న బాలల పరిస్థితి. కరోనా నేపథ్యంలో బడులు తెరుచుకోకపోగా, చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి అక్షరాలు నేర్వకుండానే కరీంనగర్ జిల్లాలోని సర్కారు బడుల్లోని 1వ తరగతి విద్యార్థులు కొత్త విద్యాసంవత్సరంలో 2వ తరగతి చదివేందుకు ప్రమోట్ అయ్యారు. పాఠాలు చదవడం, రాయడం వంటివి నేర్వకుండానే 2వ తరగతి విద్యార్థులను 3వ తరగతిలో చేర్చారు. చదువుల్లో వీరి భవిష్యత్తు ఏమిటన్నది జిల్లాలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అంతుబట్టని విషయంగా మారింది. పునాదిగా నిలిచే ప్రాథమిక విద్యాభ్యాసానికి కరోనా ప్రతిబంధకాలు సృష్టించడంతో కొత్త విద్యాసంవత్సరంలో వీరి పరిస్థితి ఏమిటన్నది జిల్లాలోని తల్లిదండ్రులకు బెంగ పట్టుకుంది.
పలు వస్తువులను గుర్తించి వాటి పేర్లు రాస్తున్న చిన్నారి
పేర్ల నమోదు వరకే...
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని పాఠశాలలను ప్రారంభించ లేదు. 3-10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్, టీవీల ద్వారా తరగతులను నిర్వహించింది. 1, 2వ తరగతుల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగిసే నాటికి ఎలాంటి తరగతులు జరగలేదు. ఆయా తరగతుల్లో ప్రవేశాలను మాత్రం అన్ని పాఠశాలల్లో చేపట్టారు. ముఖ్యంగా కరోనా కారణంగా జిల్లాలోని సర్కారు బడుల్లో బాలలెవరూ అడుగుపెట్టలేదు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆటా, పాటల ద్వారా అక్షరాలతో పాటు అంకెలు నేర్చుకుని తెలుగు, ఆంగ్లం, గణితం పుస్తకాల ద్వారా చదువులో పునాదిని పటిష్ఠం చేసుకునే 1వ తరగతిలో బాలలెవరికి వీటి గురించి తెలియని విషయంగా మారింది. 2వ తరగతి బాలల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
* ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో చేరిన బాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి చదువులను పూర్తి చేయాల్సి ఉన్నందున వారికి 1వ తరగతి పూర్తి చేయకపోయినా చదువుల్లో వారి సామర్థ్యాలు కొంత మెరుగ్గానే ఉంటాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలలు చదువుల్లో ఎలాంటి పునాది లేకుండా వారు పైతరగతులకు వెళుతుండటంతో వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఓ పరీక్షగా మారింది. చదువుకున్న కుటుంబాల్లో చిన్నారులకు తల్లిదండ్రులు కొంత చదువులు నేర్పినా గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు చాలా మంది ఈవిషయాన్ని పట్టించుకోలేదు.
ఇలా చేయండి..
ఇళ్లలోనే ఉన్న బడీ ఈడు బాలలకు తల్లిదండ్రులపైనే ప్రస్తుత తరుణంలో ‘గురు’తర బాధ్యత ఉంది. వేసవి సెలవులు కావడం, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉండటం వల్ల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చిన్నారులకు విద్యాపరమైన విషయాలు, నైపుణ్యాలను నేర్పించాలి.