కరీంనగర్‌లో నిత్యం కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనులు చక్కబెట్టుకుంటున్న ఉద్యోగులు, ఆన్‌లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు, అనారోగ్య పీడితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నగరంలోని కట్టరాంపూర్, భగత్‌నగర్, కలెక్టరేట్, మల్కాపూర్ రహదారి, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో స్మార్ట్ సిటీ పనులు చేపట్టారు. ఇదే సమయంలో తీగల వంతెన నిర్మాణంలో భాగంగా కమాన్ నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. విస్తరణ పనులకు అనుగుణంగా విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. దీనికోసం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరాను తొలగిస్తున్నారు. పనుల కోసం నడివేసవిలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం వల్ల వేసవి తాపానికి ప్రజలు తాళలేకపోయారు. వేసవి గడిచిందనుకుంటే వర్షాకాలంలో ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సుమారు ఐదు నెలలుగా పనులు చేస్తున్నా.. అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. 8.35కిలోమీటర్ల లైన్ వేయాల్సినచోట ఇప్పటి వరకు సుమారు 4.8కిలో మీటర్లు మాత్రమే వేశారు. 11మీటర్ల ఎత్తున్న స్తంభాలు 338 వేయాల్సి ఉండగా 162 మాత్రమే వేయగలిగారు. 9.1 మీటర్ల ఎత్తు స్తంభాలు 459కుగాను సుమారు 132 పాతారు. ఎంప్లస్ 6టవర్లు 78కిగాను 59నే నిర్మాణం చేశారు.
ఆన్‌లైన్ పాఠాలుకు.. విద్యుత్ కోతలు
వైరస్ వ్యాపిస్తోన్న తరుణంలో విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలను నిర్వహించడానికి ప్రభుత్వం ఆనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాలం అందుబాటులో ఉన్న విద్యార్థులు చరవాణి, ల్యాప్‌టాప్‌లో వింటున్నారు. కానీ టీవీలో పాఠాలు వినాలనుకునే వారు మాత్రం కరెంటు సరఫరాలేక నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడం వల్ల అన్ని సౌకర్యాలు ఉన్న విద్యార్థులు ల్యాప్‌టాప్‌లకు విద్యుత్తు బ్యాకప్ సరిపోక మధ్యలోనే తరగతులు వదులుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. సెల్‌ఫోన్ ఛార్జింగ్ మధ్యలో నిండుకుంటే అంతే సంగతులు. సాప్ట్‌వేర్ ఉద్యోగులు, ఆన్‌లైన్ ఆధారంగా పనిచేసే ఉద్యోగులు, కరెంటు పనిచేసే జిరాక్స్ యంత్రాలు, డీటీపీ ఆపరేటర్లు విద్యుత్తు సరఫరా లేక తలలు పట్టుకొనే పరిస్థితి నెలకొంటోంది. కోతలతో ప్రైవేట్ నెట్‌వర్క్ కేబుళ్ల ద్వారా అంతర్జాల సేవలు కోల్పోతున్నారు. ఏ ప్రాంతంలో పనులు జరిగితే ఆ ప్రాంతంలో మాత్రమే కరెంటు సరఫరా నిలిపివేయకుండా చాలా చోట్ల నిలిపివేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సమయపాలన ఉండటం లేదని.. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల పనుల్లో తాత్సారం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్న సమయాన్ని మినహాయిస్తే కొంత వరకైనా మేలు జరిగే అవకాశం ఉందని విద్యార్దుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:బలిగొంటున్న ఆన్‌లైన్ బోధన! అర్థం కాక విద్యార్థుల్లో ఆందోళన