హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నేటితో ప్రచారం ముగియటంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు చోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... కవర్లలో నగదు పెట్టి పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నేపథ్యంలో.. ప్రలోభాలపై పోలీసులు దృష్టి పెట్టారు. అటు గ్రామాల్లోని చోటామోటా నాయకుల కదలికలపై ఫోకస్ పెట్టిన అధికారులు.. ఇటు ఇన్ని రోజులు ప్రచారం కోసం బడా నాయకులు పెట్టిన క్యాంపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. చిన్నా, పెద్ద నాయకుల వాహనాలన్నింటినీ తనిఖీలు చేస్తున్నారు.
హరీశ్ క్యాంపులో తనిఖీలు..
హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ కళాశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా.. గత రెండు నెలలుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు... కిట్స్ కళాశాల గెస్ట్‌హౌస్‌లోనే బస చేశారు. ఇక ప్రచారం చివరి రోజు నేపథ్యంలో కిట్స్ కళాశాలలోని గెస్ట్‌హౌజ్‌ను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, బెడ్రూంతో పాటు ఆయా గదుల్లోని కప్‌బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే భాజపా ఫిర్యాదు చేయడం వల్లనే తనిఖీలు నిర్వహించారని తెరాస నాయకులు ఆరోపించారు. మరోవైపు.. సింగపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు.
అధికారులకు సీఈఓ ఆదేశాలు..