తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీలో చేరే వరకే పీకే వ్యూహకర్త... ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్త: రేవంత్ రెడ్డి

Revanth Reddy on KCR: సీఎం కేసీఆర్ దిల్లీ పోయి మంత్రులతో విందులు, వినోదాలు చేసుకున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరి రైతులను ఆదుకోవడానికి వస్తున్నా అని రాహుల్ గాంధీ చెప్పడంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టిందని అన్నారు. కేసీఆర్​ను నమ్మినోళ్లు అన్యాయం అయ్యారని.. నమ్మనోళ్లు వడ్లు అమ్ముకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్​తో పని చేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారని.. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కమిటీ వేసిందని వెల్లడించారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Apr 25, 2022, 7:10 PM IST

Revanth Reddy on KCR: రైతుల ఆత్మహత్యలు, సమస్యలపై కాంగ్రెస్ నడుం బిగించిందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతలు పోరాటం చేసి ప్రధాని మోదీ వెనక్కి తగ్గేలా చేశారని అన్నారు. గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో 8 వేల మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మే 6న హనుమకొండలో తలపెట్టిన రైతు సంఘర్షణ సభ సన్నాహక సమావేశం కరీంనగర్​లో నిర్వహించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాసంగిలో అయినా వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అనుకున్నామని... వరిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. కేసీఆర్ అందరిని వరి వేయొద్దని చెప్పి... ఆయన 150 ఎకరాల్లో వరి వేశారని విమర్శించారు. కేసీఆర్ డ్రామాను బయట పెడతామంటే తమను అరెస్ట్ చేయించారని అన్నారు. పంట దిగుబడి అవుతున్నా ఇంత వరకూ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కేసీఆర్ దిల్లీ పోయి మంత్రులతో విందులు వినోదాలు చేసుకున్నారు. వరి రైతులను ఆదుకోవడానికి వస్తున్నా అని రాహుల్ గాంధీ చెప్పడంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టింది. కేసీఆర్​ను నమ్మినోళ్లు అన్యాయం అయ్యారు. నమ్మనోళ్లు వడ్లు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది కార్యకర్తలు ఉన్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి రైతు బిడ్డ చలో వరంగల్ అంటూ రాహుల్ సభకు కదులుతారని ఆశిస్తున్నా. కేసీఆర్​ను పాతాళానికి తొక్కితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. రాహుల్ సభ రాజకీయ సభ కాదు రైతుల సభ. రైతాంగ పోరాట స్ఫూర్తితో తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పీడ కేసీఆర్​ను వదిలిస్తాం.' - రేవంత్ రెడ్డి

Revanth Reddy on PK: గత మూడు రోజులుగా ఓ అలజడి వస్తోందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ వ్యూహకర్త పీకే కాంగ్రెస్​, తెరాసను కలపడానికి వచ్చారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి తాము ఏమి చెప్పలేమని తెలిపారు. కేసీఆర్​తో జట్టు కట్టేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ విషపు నాగు లాంటోడని.. పాలు పోసినోడినే కాటేస్తారని ఆరోపించారు. పీకేపై విచిత్ర ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

కాంగ్రెస్​తో పని చేసేందుకు పీకే ఆసక్తి చూపుతున్నారని.. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కమిటీ వేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. పీకే కాంగ్రెస్​లో చేరాలంటే... భాజపాతో జట్టుకట్టిన ప్రాంతీయ పార్టీలతో ఉన్న వ్యాపార ఒప్పందాలను వదులుకోవాలని చెప్పారని వెల్లడించారు. తెరాసతో చేసుకున్న అవగాహన నుంచి తప్పుకునేందుకే కేసీఆర్​తో పీకే భేటీ అయ్యారని తెలిపారు. పార్టీలో చేరే వరకే వ్యూహకర్త... ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటారని పేర్కొన్నారు. పార్టీ ఏది చెబితే అది పాటిస్తారని.. కరీంనగర్​కు వచ్చి ఇంటింట ప్రచారం కూడా చేస్తారని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ

సమోసా తిన్నాడని హత్య.. ఫోన్​ కోసం అన్నాచెల్లెళ్ల గొడవ.. మహిళ బలి

ABOUT THE AUTHOR

...view details