వాళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు. వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకీడిస్తున్న జీవితాలు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే... పురుగు పోటు, వాతావరణ మార్పులు, ధరలు లేకపోవడం లాంటి సమస్యల్లాంటివి వారిని తీవ్రంగా నష్టపరిచాయి. అప్పులు మీద పడుతుంటే తట్టుకోలేక పురుగుల మందు తాగో లేదా ఉరివేసుకునో తనువు చాలించారు. ఏ ఆధారం లేని కుటుంబాలకు కావడంతో... ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ సంవత్సరాల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు..
జిల్లాల విభజన కాకముందు రైతులు చనిపోతే ఇప్పటికీ వారికి పరిహారం అందలేదు. తమ గోడు విని ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నా... పట్టించుకోవట్లేదని జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపోతున్నారు. వారం వారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను వెల్లబుచ్చుకున్నా... పట్టించుకున్న వారు లేరని కన్నీటి పర్యంతమవుతున్నారు.