గ్రామీణ మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు తయారు చేసిన డిజైన్లు పరిశీలిస్తే ఏ ప్రాతిపదికన లెక్కలు కట్టారో ఆ అధికారులకే తెలియాలి. అదే అర్బన్ మిషన్ భగీరథలో మాత్రం 2011 జనాభాను తీసుకొని 2044 సంవత్సరం వరకు సరిపడా జనాభాకు నీరందించేలా డిజైన్లు, నీటి వ్యవస్థను రూపొందించారు. ఆ పనులు కూడా పూర్తయి నగరానికి ప్రతిరోజు నీటి సరఫరా చేస్తున్నారు. గ్రామీణంలో మాత్రం 2011 జనాభాలో సగం జనాభాను లెక్కించడంతో ఉన్న ఇళ్లకు కూడా తాగునీరు సరఫరా చేయని దుస్థితి నెలకొంది. పైగా అసంపూర్తిగా పైపులైన్లు, ట్యాంకులు నిర్మించినా సాంకేతిక సమస్యలు, ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడం, ఒక్కొక్క ట్యాంకు నిండడానికి 20 గంటల సమయం పడుతుండటంతో వీధుల్లో పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు.
ఇవిగో సమస్యలు..
*తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్, హనుమాన్‌నగర్, రామాలయం వైపు ఇంటర్ కనెక్షన్లు, గేట్ వాల్వులు బిగించాల్సి ఉంది.
*రేకుర్తిలో సగం జనాభాను లెక్కించడంతో ఐదు కిలోమీటర్ల దూరం పైపులైను పెండింగ్‌లో ఉంది. ఇక్కడ లక్ష, 90వేలు ట్యాంకులు నిర్మించారు. వాటికి నీరందడం లేదు. ప్రస్తుతం బావి ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
*పద్మనగర్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయి. రోజులో ఒకేసారి నీటిని నింపుతున్నారు. రెండుసార్లు నింపితే నీటి సరఫరా జరుగుతుంది. ఇంటర్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
*సీతారాంపూర్‌లో ఆంధ్రాబ్యాంకు గల్లీ, ఆర్టీసీ కాలనీ, సాయిబాలాజీనగర్ కాలనీకి నీటి సరఫరా జరుగుతుండగా, సూర్యనగర్, బ్యాంకు వెనుకాల, పాత సీతారాంపూర్ వైపు రెండు బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
* అలుగునూర్‌లో బావి నీళ్లు పంపిణీ చేస్తున్నారు.
గ్రామీణ మిషన్ భగీరథలో అసంపూర్తిగా చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేందుకు ఆ శాఖకు నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి, సీఎంవోతో జరిగిన సమావేశంలో మాట్లాడటం జరిగింది. మిగతా పనులు నగరపాలిక చేసేందుకు చర్యలు చేపడుతుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.5.13కోట్లతో టెండర్లు పిలిచాం. పైపులైన్ల పనులు ప్రారంభించడం జరుగుతుంది.
పద్మనగర్ బృందావనం కాలనీలో పైపులైన్లు వేయలేదు. ఇంటర్ కనెక్షన్లు చేయకపోవడంతో నీటి సరఫరా కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు డబ్బాలు పట్టుకొని రాంనగర్ వైపు పరుగులు పెట్టాల్సి వస్తోంది.