హుజూరాబాద్‌లో ఇన్నాళ్లుగా సాగించిన ప్రచారం ఒకెత్తయితే నేటి రోజులో ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలనే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు మునిగి తేలాయి. ఓటర్ల చుట్టూర జరుగుతున్న లాబీయింగ్‌లో పై చేయి సాధించాలనే తపనను చూపుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే తెరతీసిన ప్రలోభాలకు అదనంగా కొన్నివర్గాల ఓట్లను ఎలా తమవైపునకు తిప్పుకోవాలనే విషయంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవానికి ఆయా పార్టీల తరపున ఇక్కడి నియోజకవర్గానికి వచ్చి ఇన్నాళ్లుగా మకాం వేసిన నేతలంగా కోడ్ నిబంధనల మూలంగా సమీపంలోని సరిహద్దు మండలాల నుంచి మంత్రాగాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా ఉంటున్న నేతలతో ఫోన్‌లో సంభాషిస్తూ తగు సూచనల్ని అందిస్తున్నారు.
మందు.. మనీ.. బిర్యానీ..?
కొంతకాలంగా ఇక్కడ మద్యం పంపిణీ కీలక భూమికను పోషిస్తోంది. తాగినోళ్లకు తాగినంత మద్యాన్ని అందిస్తున్నారు. ఆయా పార్టీల తరపున ఓటర్ల ఇంటికి ఇవి రహస్యంగా చేరుతున్నాయనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తోంది. కొన్ని పార్టీలు మందుతోపాటు కొంత నగదును అందిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బిర్యానీ ప్యాకెట్లను కుటుంబంలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా పంపిణీ చేస్తున్నారని తెలిసింది. వీటికి తోడుగా శీతల పానీయాలను కూడా ఓటర్ల చెంతకు చేరుస్తున్నారనే ప్రచారం ఓటర్ల ద్వారా వినిపిస్తోంది. ఓటరును మచ్చిక చేసుకునేందుకు పలురకాలుగా తాయిలాలు, నజరానాల రూపంలో ఎర వేసేందుకు కొన్ని పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.