హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక (Huzurabad by election) అనివార్యం కావడం వల్ల రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార తెరాస పార్టీ (Trs Party) మరోమారు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేసింది. ఫలితంగా మాజీ మంత్రులు ఎల్.రమణ, పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) సైతం కారెక్కారు. కౌశిక్ రెడ్డికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన చేరిన సందర్భంగా తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) హామీ ఇచ్చారు.
కేబినేట్ ఆమోదించినా...
అన్నట్లుగానే ఈనెల 1న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా (Governor Quota)లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి పాడి కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. దీంతో కౌశిక్ రెడ్డి జాక్‌పాట్ కొట్టినట్లైంది. మంత్రివర్గం నిర్ణయంతో పెద్దలసభలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైన కౌశిక్... ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అనుచరులు, సన్నిహితులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.
వెలువడని గెజిట్...
కానీ... కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయినట్లు అధికారికంగా మాత్రం గెజిట్ నోటిఫికేషన్, ఉత్తర్వులు వెలువడలేదు. ప్రమాణ స్వీకారం కోసం కౌశిక్ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మంత్రివర్గ తీర్మానాన్ని వీలైనంత త్వరగా గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపిస్తారు. గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వులు జారీ చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎమ్మెల్సీగా నియామకమైనట్లు అధికారిక ప్రకటన జారీచేస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయవచ్చు.
గడువు లేనప్పటికీ...
మంత్రివర్గ తీర్మానం జరిగి పక్షం రోజులు గడచిపోయింది. ఇంకా ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్, ఉత్తర్వులు వెలువడలేదు. ఏం జరిగిందన్నది ఉత్కంఠగా మారింది. కౌశిక్ ఎమ్మెల్సీ వ్యవహారంపై అక్కడక్కడా చర్చ తప్ప... ఎక్కడా ఎలాంటి కదలికా... వినికిడి లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్ నుంచి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఎక్కడ ఆగింది? ఎవరు ఆపారన్న విషయమై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే గవర్నర్ ఇన్ని రోజుల్లో ఆమోదించాలన్న నిర్ధిష్ట గడవు ఏదీ లేనప్పటికీ గత సంప్రదాయాలను చూస్తే ఎక్కువ రోజులు ఆగిన పరిస్థితి లేదు.
పెండింగ్‌లోనే...
ఇటీవల మహారాష్ట్రలో 12 మంది నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ పెండింగ్‌లోనే పెట్టారు. ఈ వ్యవహారం న్యాయస్థానానికీ చేరింది. గవర్నర్ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ నలుగురిని పెద్దలసభకు నామినేట్ చేస్తే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రెండు రోజుల పాటు ఆపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలిశాకే ఆమోదం లభించింది.
జాప్యానికి కారణం ఏంటీ?
కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఏం జరుగుతోందన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. జాప్యానికి పాలనా పరమైన కారణాలా లేక రాజకీయపరమైనా కారణాలు ఉన్నాయా... అన్న విషయమై స్పష్టత లేదు. వాస్తవానికి ఇటీవల పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీలుగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణిదేవి కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలుపొందిన నోముల భగత్... ఈనెల 12న శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరోజు లేదా ఆ తర్వాత పల్లా, వాణిదేవి, కౌశిక్ ప్రమాణస్వీకారం ఉంటుందని భావించారు. కానీ, కౌశిక్ రెడ్డికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అన్న విషయంలో ప్రస్తుతానికి స్పష్టత కరవైంది.
ఇదీ చూడండి:COUPLE SUICIDE: కరోనా వేళ.. అప్పుల బాధ భరించలేక..